ఉక్కు భూములు కొట్టేసేందుకు మాస్టర్ ప్లాన్

విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేయాలని కేంద్రం ప్లాన్ వేస్తోందని సీపీఎం ఘాటైన ఆరోపణలు చేస్తోంది. ఏకంగా మూడు వేల ఎకరాలను లాక్కోవాలని కేంద్రం చేస్తున్న దారుణమైన  ప్రయత్నాలను తిప్పుకొడతామని ఉక్కు ఉద్యమ నేత…

విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేయాలని కేంద్రం ప్లాన్ వేస్తోందని సీపీఎం ఘాటైన ఆరోపణలు చేస్తోంది. ఏకంగా మూడు వేల ఎకరాలను లాక్కోవాలని కేంద్రం చేస్తున్న దారుణమైన  ప్రయత్నాలను తిప్పుకొడతామని ఉక్కు ఉద్యమ నేత సీహెచ్ నరసింగరావు హెచ్చరించారు.

కేంద్రం ఒక్క ఎకరా తీసుకోవాలని చూసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన పేర్కొనడం విశేషం. ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు ఈ రోజు సామర్ధ్యం 7.3 మిలియన్ టన్నుల నుంచి 20 మిలియన్ టన్నులకు పెంచుకునే అవకాశాలు ఉన్నాయని, మరి సామర్ధ్యం పెంచి ఉత్పత్తిని పెంచాలనుకున్నపుడు కొత్తగా భూములు ఎక్కడ నుంచి వస్తాయని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.

కేంద్రం ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని బలహీనపరచాలని చూసినా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తిప్పికొడుతూ తన సత్తాను చాటుకుందని ఆయన అంటున్నారు. అంతే కాదు సొంత గనులు లేకపోయినా కూడా దేశంలో ఇతర స్టీల్ ప్లాంట్లకు ధీటుగా విశాఖ ఉక్కు ఎదిగింది అంటేనే అది కార్మిక విజయం అని ఆయన చెప్పారు.

విశాఖ ఉక్కు ఏపీకి గర్వకారణం అని అలాంటి ప్లాంట్ విషయంలో వేటు వేయాలని చూస్తే వేలాది కార్మికులు ఉప్పెనలా ముందుకు వస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 1న స్టీల్ సెక్రటరీ విజయవాడ వచ్చి కార్మికులతో మీటింగ్ పెట్టాలని చూసినా ఎవరూ హాజరు కాకపోవడంతో రద్దు చేసుకుని వెళ్ళిపోయారని నరసింగరావు గుర్తు చేశారు. 

అదీ ఉక్కు సంకల్పం అంటే. దీన్ని కేంద్రం అర్ధం చేసుకుని తన ప్రైవేట్ ప్రయత్నాలకు శాశ్వతంగా స్వస్తివాచకం పలకాలని ఆయన డిమాండ్ చేశారు.