మామూలుగా చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్దగా హడావుడి లేకుండా సాగిపోతాయి. పెద్దల సభకు వెళ్లేవారు పెద్ద మనిషి తరహాలోనే ప్రచారం చేసుకుంటారు. ఎపుడూ ఇలాగే సాగుతూ వస్తోంది. కానీ మొదటిసారి ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయం మాత్రం పూర్తి భిన్నంగా సాగింది.
సార్వత్రిక ఎన్నికల హడావుడి పూర్తిగా కనిపించింది. ఓటుకు నోటు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి. అధికార పక్షం నుంచి వైసీపీ తొలిసారి పోటీ చేస్తూండడంతో ఈ ఎన్నికలు ప్రతిష్టగా తీసుకుంది. విపక్ష తెలుగుదేశం ఆ తరువాత రేసులోకి వచ్చింది.
ఈ పరిణామంతో ఏపీలో ఉన్న రాజకీయ వేడి వాడి కాస్తా ఎమ్మెల్సీ ఎన్నికల మీద కూడా బాగా పడింది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ప్రలోభాలు అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సాదా జనం దాకా వెళ్ళి మాకేదీ ఓటూ నోటూ అని పట్టభద్రులు కానీ జనాలు కూడా నేతల ఇళ్ళకు వచ్చి వాకబు చేయడమే ఈ ఎన్నికల్లో చిత్రంగా చెప్పుకోవాలి.
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా బాగా పంచేస్తున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు అని విపక్ష నేతల నుంచి విమర్శలు రావడం జరుగుతోంది కానీ అధికార పక్షం వైపు నుంచి అంతలా సందడి అయితే లేదని అంటున్నారు. ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారు అయితే ఒకరికి రెండు వేలు ఇచ్చి మరొకరికి వేయి రూపాయలు మాత్రమే వైసీపీ వారు ఇస్తున్నారని, ఏమిటీ పక్షపాతం అని ప్రశ్నిస్తున్నారు.
ప్రలోభాలలో కూడా ఇంత వివక్షా అని నిలదీయడం ఆయనకే చెల్లిందనుకోవాలి. ఇక పట్టభద్రులు అయినా సగటు జనాలే కదా. ఏ తాయిలాలూ మా దాకా రాలేదు అని చాలా మంది ఓట్లకు దూరంగా ఉండిపోయిన సంఘటనలూ చోటు చేసుకున్నాయి. ఏతా వాతా జరిగింది ఏంటి అంటే ఇంతలా ప్రచారం చేయడం వల్ల ఓటింగ్ మీద కూడా దాని ప్రభావం పడింది. అన్ని పార్టీల ఉత్సాహంతో దాదాపుగా మూడు లక్షల దాకా పట్టభద్రుల ఓటింగ్ నమోదు అయింది. ఇందులో సగం అంటే లక్షా యాభై వేల ఓటింగ్ అయినా జరుగుతుందా అన్నదే చూడాలి.
పట్టభద్రుల ఓటింగ్ ని పెద్దల సభకు ఎన్నికయ్యే వారి హుందాతనాన్ని ఇలా పోటా పోటీ రాజకీయాలు తగ్గించేశాయన్న భావన అయితే మేధావుల నుంచి వస్తోంది. ఎవరు నెగ్గినా ఏముంది గర్వకారణం అన్న నీరసం మాటలు సైతం ఒక సెక్షన్ నుంచి వినిపిస్తున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తొంటే రేపటి ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు రిహాల్సల్స్ గానే పార్టీలు చూస్తున్నాయని అంటున్నారు.