పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ తర్వాత జనసేన, టీడీపీ మధ్య బంధం పెరిగింది. చంద్రబాబు పర్యటనలో జనసేన జెండాలు కనిపిస్తున్నాయి. టీడీపీనే ఉద్దేశ పూర్వకంగా జనసేన జెండాలు పెడుతోందా? లేక ఆ పార్టీ నేతలు చేస్తున్నారా? అనే విషయమై స్పష్టత లేదు. కానీ జనసేన, టీడీపీ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాయి. అయితే జనసేనకు బీజేపీతో అధికారిక పొత్తు వుంది. రానున్న ఎన్నికల్లో తామిద్దరమే కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు తరచూ చెబుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతృత్వంలో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో జనసేన పాల్గొంటుందా? ఆ పార్టీ జెండాలు కనిపిస్తాయా? అనేది చర్చనీయాంశమైంది. ఎందుకంటే చంద్రబాబు పర్యటనలోనే జనసేన పాల్గొంటున్న పరిస్థితుల్లో, ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని జనసేన ఏమీ పట్టనట్టు వుంటుందా? అనే చర్చకు తెరలేచింది.
విశాఖలో జనసేనకు మంచి పట్టు వుంది. గాజువాకలో పవన్‌కల్యాణ్ పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. విశాఖతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పవన్‌కల్యాణ్ సామాజిక వర్గం నేతలు, ఆయన అభిమానులు బాగా వున్నారు. ఈ నేపథ్యంలో జనసేనను బీజేపీ కలుపుకుపోతుందనే చర్చ నడుస్తోంది. అయితే ప్రధాని అపాయింట్‌మెంట్ తమ నాయకుడికి ఇప్పించలేదనే ఆగ్రహం జనసేనలో వుంది.
జనసేన, బీజేపీ మధ్య బంధం ఎంత దృఢంగా వుందో ప్రధాని పర్యటన తేల్చి చెబుతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్‌ను ఆహ్వానించడం తమ చేతల్లో లేదని, అదంతా ప్రధాని కార్యాలయం చూసుకుంటుందని ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని పర్యటనలో జనసేన పాల్గొనడంపై ఆసక్తి నెలకుంది.