టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ముందు లోకేశ్ ఒక బచ్చా అని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం సూత్రధారి నారా లోకేశ్ అని ఆయన ఆరోపించారు. సీమెన్స్ కంపెనీతో డమ్మీ ఒప్పందం చేసుకుని రూ.300 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. సీఎం హోదాలో చంద్రబాబు ఏం చేశారని ఎంపీ నిలదీశారు.
సెల్ కంపెనీల ద్వారా ఈ సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని విమర్శించారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేస్తుందన్నారు. దోషులెవరినీ వదిలే ప్రశ్నే లేదన్నారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పుత్రుడే కీలక పాత్ర అని ఆయన ఆరోపించడం గమనార్హం. సీఎం జగన్‌పై పూర్తి విశ్వాసంతోనే ఆంధ్రప్ర దేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వచ్చారన్నారు.
విశాఖలో పెద్ద ఎత్తున్న జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఎంవోయూలు జరగడం ఇదే ప్రథమమన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఏ సమస్య వచ్చినా తీరుస్తామని సీఎం చెప్పారన్నారు. కడుపు మంటతో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బురదజల్లుతోందని మండిపడ్డారు.
ముకేష్ అంబానీని విమర్శించే స్థాయి లోకేష్ దా… లోకేష్ స్థాయి ఏంటి అని ఆయన నిలదీశారు. తెలుగు డ్రామా పార్టీ కొంతమందిని ఏర్పాటు చేసి డ్రామా చేస్తోందని మార్గాని భరత్ ధ్వజమెత్తారు. ఇండస్ట్రీకి ఇంతమంది పెద్దలు వస్తే లోకల్ అంటారా అని ప్రశ్నించారు. లోకేశ్ ముఖ్యమంత్రితో పోల్చుకుంటున్నారన్నారు. లోకేష్ మూడు శాఖలకు మంత్రిని చేశాను అంటున్నారని… కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని దెప్పి పొడిచారు. కియాను చంద్రబాబు తీసుకురాలేదని.. కేంద్రం సిఫార్సు చేస్తే రాష్టానికి వచ్చారన్నారు.