టీడీపీలో చేరనున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో 3 వేల మందితో కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తనతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారన్నారు. మరింత మందికి బయటికి వస్తారని చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడ్తానని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా బీజేపీని కన్నా లక్ష్మీనారాయణ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు గుర్రుగా వున్నారు.
కన్నా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. “ఔను కన్నా చెబుతున్నది నిజమే. కన్నాతో జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్, ఆ పార్టీకి చెందిన మరికొందరు ముఖ్య నేతలు టచ్‌లో ఉన్నారు” అంటూ నెటిజన్లు తమదైన సృజనాత్మకతకు పదును పెట్టారు.
కన్నా లక్ష్మీనారాయణ మరీ అంత బలమైన నాయకుడైతే గత పదేళ్లుగా రాజకీయంగా ఎందుకు రాణించలేకపోతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలమే ఆయన బలమని బీజేపీ నేతలు అంటున్నారు. ఇంతకాలం బీజేపీని వాడుకుని, తీరా ఎన్నికల సమయంలో పార్టీని ముంచడానికి కన్నా ప్రయత్నించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు…ఇలా టీడీపీలోకి వెళ్లాలనుకున్న నేతలు మాత్రమే కన్నాతో టచ్‌లో ఉంటున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. కన్నాకే దిక్కు లేదని, ఇక ఆయన్ను నమ్ముకుని టీడీపీలోకి, మరోపార్టీలోకి ఎవరు వెళ్తారనే ఆసక్తికర చర్చకు తెరలేచింది.