కేవలం ఒకే ఒక్క ఎన్నికలో ఓటమిపాలైన మెగాబ్రదర్ నాగబాబుకు పోటీపై ఆసక్తి పోయింది. ఈ విషయాన్ని తనే ప్రకటించడం గమనార్హం. ఉత్తరాంధ్ర లో జనసేన నాయకుడు నాగబాబు రెండు రోజులుగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలో జనసేన నాయకులతో నాగబాబు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదని సంచలన వ్యాఖ్య చేశారు. జనసేనాని పవన్‌కల్యాణ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా జనసేన సిద్ధంగా ఉందన్నారు. త్వరలో బూత్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామని నాగబాబు చెప్పుకొచ్చారు.
గత ఎన్నికల్లో నాగబాబు నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేశారు. 2,50,289 ఓట్లు సాధించి మూడో ప్లేస్‌లో నిలిచారు. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు గెలుపొందిన సంగతి తెలిసిందే. జనసేన స్థాపించి తొమ్మిదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు కనీసం బూత్ కమిటీలు కూడా వేసిన పరిస్థితి లేదు.
రానున్న రోజుల్లో బూత్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామని నాగబాబు చెప్పడం విశేషం. అంతేకాదు, ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనే చందంగా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని నాగబాబు ప్రకటించడం పెద్ద జోక్‌గా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా వుండగా ఎన్నికలపై నాగబాబు ఆసక్తి కనబరచకపోవడం వెనుక ఓటమి భయమే కారణమనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.