ఎన్నికలు ముంచుకుని వస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ముంగిటకు వస్తున్నారు. సరిగ్గా అయిదేళ్ళ క్రితం ఆయన విశాఖకు ఇదే సమయంలో వచ్చారు. అప్పట్లో మార్చి 2న విశాఖలో మోడీ ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. విశాఖకు రైల్వే జోన్ ని తీసుకుని వచ్చాను అని ఆయన ప్రకటించారు.
ఈ అయిదేళ్ళలో రైల్వే జోన్ అయితే ఏ విధంగా అడుగు ముందుకు పడలేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం భూములు చూపించలేదు అని బీజేపీ నేతలు కేంద్ర మంత్రి ఆరోపిస్తూంటే భూములు ఎపుడో ఇచ్చామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ వివాదం అలాగే కొనసాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం అన్నది పక్కన పెడితే రైల్వే శాఖకు పెద్ద ఎత్తున విశాఖలో భూములు ఉన్నాయని పని ప్రారంభించడానికి ఆ భూములు సరిపోవా అని వామపక్షాలు ప్రశ్నిస్తున్నారు. చూస్తూండగానే అయిదేళ్ళూ ఇట్టే గడచిపోయాయి. రైల్వే జోన్ మరోసారి ఎన్నికల హామీగా మారిపోయింది.
ఇపుడు నరేంద్ర మోడీ విశాఖకు మళ్ళీ వస్తున్నారు. 2024 ఎన్నికల ముందు నోటిఫికేషన్ రాకుండానే విశాఖ పర్యటన పెట్టుకుంటున్న మోడీ విశాఖ వేదికగా ఏ వరాలు ఇస్తారు అన్న ఆసక్తి సర్వత్రా పెరుగుతోంది. అయితే వరాల సంగతి పక్కన పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని చెబితే అదే కొండంత అండ అని అంటున్నారు.
దీని మీద విశాఖ ఉక్కు పోరాట సంఘం నాయకులు అయితే ప్రధాని మరో వారంలో విశాఖ పర్యటన చేపట్టనున్నారని ఆయన ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా ప్రధానిని ఒప్పించి ఆయన నుంచి సానుకూల ప్రకటన వచ్చేలా చూడాల్సిన బాధ్యతను అధికారంలో ఉన్న వైసీపీ, బీజేపీతో పొత్తు కోసం చూస్తున్న టీడీపీ జనసేన పార్టీలు తీసుకోవాలని వారు కోరారు.
స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకుండా నష్టాలు పేరు చెప్పి ప్రైవేటీకరించడం తగదని వారు అంటున్నారు. లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని అందించే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. విశాఖ వస్తున్న ప్రధాని ముందే తన నిరసనను తెలియచేస్తామని కూడా చెబుతున్నారు.