టీడీపీ, జనసేన పొత్తులో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. పొత్తులో సీట్లు, నియోజకవర్గాల ప్రకటన అత్యంత కీలకమైనవి. వీటిని తేల్చుకునేందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వరుసగా చర్చలు జరుపుతున్నారు. జనసేనకు టీడీపీ కేటాయించే సీట్లపై ఎల్లో మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 30 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు మించి జనసేనకు ఇచ్చే ప్రశ్నే లేదని టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో జనసేనకు షరతు విధించినట్టు టీడీపీ విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సగం సీట్లలో అభ్యర్థుల ఎంపిక పవన్‌కల్యాణ్ ఇష్టమని టీడీపీ నేతలు తెలిపారు. మిగిలిన సగం సీట్లలో టీడీపీ చెప్పినట్టే అభ్యర్థులను ఎంపిక చేయాలని షరతు విధించినట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు పవన్‌కల్యాణ్ అంగీకరించారని కూడా టీడీపీ విశ్వసనీయ నాయకులు చెప్పడం విశేషం.
నిజానికి జనసేనకు 20 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు ఇవ్వడమే ఎక్కవ అనే అభిప్రాయంలో తమ పార్టీ ముఖ్య నేతలున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. కానీ ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతానని పవన్‌కల్యాణ్ తమ వెంట పడుతుండడంతో చంద్రబాబు కాదనలేక పొత్తుకు అంగీకరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తన పరువు కాపాడుకునేందుకు కాస్త ఎక్కువ సీట్లు ఇవ్వాలని, అప్పుడే తమ ఓట్లు టీడీపీకి బదిలీ జరిగి రాజకీయ ప్రయోజనం సిద్ధిస్తుందని పవన్ చర్చల్లో భాగంగా చంద్రబాబుతో అన్నట్టు టీడీపీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో మధ్యస్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలను సంతృప్తిపరిచేందుకు పేరుకు 30 లోపు సీట్లు ఇస్తూనే, అందులో సగం సీట్లతో తాము ఎంపిక చేసిన నాయకులకే టికెట్లు కేటాయించేలా ఒప్పందం జరిగిందని టీడీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
ఇందులో భాగంగానే చంద్రబాబు ఆదేశాలు లేదా సూచనల మేరకు జనసేలోకి వైసీపీ నుంచి వచ్చే, అలాగే సొంత పార్టీ నేతల్ని కూడా పంపి బలమైన అభ్యర్థులను నిలపడానికి కార్యాచరణ రెడీ అయ్యిందని టీడీపీ ముఖ్య నేతలు చెప్పారు.