గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో నెగ్గిన ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కడప జిల్లా పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి 90110 ఓట్ల తేడాతో నెగ్గారు. తన సమీప ప్రత్యర్థి సతీష్ రెడ్డి మీద జగన్ ఆ భారీ మెజారిటీని సాధించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అదో రికార్డు మెజారిటీ.
అంతకు ముందు జగన్ 75 వేల స్థాయి మెజారిటీతో 2014 ఎన్నికల్లో పులివెందుల నుంచి నెగ్గారు. అప్పటికే ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అదే నియోజకవర్గం నుంచి సాధించిన మెజారిటీ రికార్డును బద్దలు కొట్టారు! 2019 నాటికి జగన్ పులివెందుల్లోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డును సొంతం చేసుకున్నారు.
ఇక2019 ఎన్నికల్లో జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థి ప్రకాశం జిల్లా నుంచి నెగ్గారు. ఆ నియోజకవర్గం గిద్దలూరు. ఎన్నికలకు కాస్త ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్నా రాంబాబు గిద్దలూరు నుంచి భారీ మెజారిటీతో నెగ్గారు. తన సమీప ప్రత్యర్థి, అప్పటి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీద అన్నా రాంబాబుకు వచ్చిన మెజారిటీ 81 వేలు. జగన్ తర్వాత మెజారిటీ విషయంలో అన్నా రాంబాబుదే అప్పుడు రికార్డు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆటపట్టైన నియోజకవర్గం గిద్దలూరు. ఇలాంటి చోట 2019 ఎన్నికలకు ముందు పలువురు ఇన్ చార్జిలు మారినా.. అఖర్లో వచ్చి అన్నా రాంబాబు జాక్ పాట్ కొట్టాడు. అయితే ఎమ్మెల్యేగా అన్నా రాంబాబు బాగా వ్యతిరేకత సంపాదించుకున్నారనే అభిప్రాయాలున్నాయి. క్షేత్ర స్థాయి నుంచి అదే టాక్ వినిపిస్తూ ఉంది.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కచ్చితంగా అభ్యర్థి మారే నియోజకవర్గాల్లో గిద్దలూరు ఒకటని టాక్. గిద్దలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నా రాంబాబు స్థానంలో మరొకరు పోటీ చేయడం ఖాయమనే అభిప్రాయాలు అటు క్షేత్ర స్థాయి నుంచి, ఇటు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.
రాంబాబు కాకున్నా.. మరెవరు పోటీ చేసినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ దక్కే కంచుకోటల్లో ఒకటిగా గిద్దలూరు నిలుస్తుంది. మరి ఈ సారి ఇక్కడ జాక్ పాట్ ఎవరిదో!