వైసీపీ యువ ఎంపీ చొర‌వ‌… నైలెట్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్న‌ల్‌!

వైసీపీ యువ ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి చొర‌వ‌తో తిరుప‌తికి ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ ఎన్ఐఈఎల్ఐటీ (నైలెట్‌) కేంద్రాన్ని కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం విశేషం.…

వైసీపీ యువ ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి చొర‌వ‌తో తిరుప‌తికి ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ ఎన్ఐఈఎల్ఐటీ (నైలెట్‌) కేంద్రాన్ని కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం విశేషం. ఈ విద్యా సంస్థ‌ను తిరుప‌తిలో ఎలాగైనా ఏర్పాటు చేసేందుకు ఏడాది కాలంగా ఎంపీ గురుమూర్తి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ విష‌య‌మై ప‌లు ద‌ఫాలు సంబంధిత కేంద్ర‌మంత్రి అశ్విని వైష్ణవ్‌, సంబంధిత అధికారుల‌తో గురుమూర్తి భేటీ అయ్యారు.

ఎంపీ ప్ర‌తిపాద‌న‌ల నేప‌థ్యంలో తిరుప‌తిలో నైలెట్ ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం మొద‌ట్లో సానుకూలత వ్య‌క్తం చేసింది. అనంత‌రం నైలెట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల‌పై అధ్యయన కమిటీని తిరుప‌తికి పంపారు. కమిటీ నివేదిక మేరకు తిరుపతిలో నైలెట్ ఏర్పాటుకు సమ్మతి తెలుపుతూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. మొత్తం రూ. 6.41 కోట్లు మంజూరు కాగా, మొదట విడతలో రూ.2.54 కోట్లు విడుదల చేస్తార‌న్నారు. మిగిలిన మొత్తాన్ని విడ‌త‌ల వారీగా కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేస్తుంద‌న్నారు.

తిరుపతిలో నైలెట్ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి విద్యను అందించే అవ‌కాశం ద‌క్కుతుంద‌న్నారు. ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐఇసిటి), అనుబంధ రంగాల్లో నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేయడం, నైపుణ్యం కలిగిన నిపుణులను అభివృద్ధి చేయడం తోపాటుగా శిక్షణ  వంటి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. 

ప్రతిష్టాత్మక శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాల‌యంలో నైలెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తార‌ని ఎంపీ తెలిపారు. ఈ ఇన్‌స్టిట్యూట్ నెల‌కొల్పిన మూడేళ్ల త‌ర్వాత సుమారు 1000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సౌకర్యం అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు.