ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల్లో జనసేన పంథా తీవ్ర చర్చనీయాంశమైంది. జీరోకు ఎంత విలువ వుంటుందో, ఏపీలో జనసేనకు కూడా అంతే. జనసేన తనకు తానుగా రాజకీయంగా గొప్ప ఏమీ చేయలేదు. ఇదే జనసేన మద్దతు ఉన్న పార్టీ మాత్రం రాజకీయంగా లబ్ధి పొందుతునడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్‌కల్యాణ్, లక్ష్యం మరిచి చాలా ఏళ్లైంది.
అందుకే ఆయనే ప్రశ్నలకు గురి అవుతున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని సిద్ధాంతాలు, లక్ష్యాలు వుంటాయి. జనసేన పార్టీ కూడా ఏడు సిద్ధాంతాలతో ముందుకొచ్చింది. ఆచరణకు వచ్చే సరికి రాజకీయంగా వైఎస్ జగన్‌ను ద్వేషించడం, చంద్రబాబుని భుజాన మోయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదమే తన రాజకీయ విధానమని పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే తన అంతిమ లక్ష్యమని పవన్ శపథం చేశారు.
ఇదిలా వుండగా జనసేనను స్థాపించిన తొలి రోజుల్లో …2014లో జగన్‌ను అధికారంలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతో టీడీపీ-బీజేపీ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ కూటమి అధికారంలోకి రావడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2019లో కూడా జగన్‌ను అధికారంలోకి రానివ్వకుండా శతవిధాలా పవన్ ప్రయత్నించారు. చివరికి తానే నిలిచిన రెండు చోట్లా ఓటమిని మూటకట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ముచ్చటగా మూడో సారి 2024లో వైసీపీ లేని ఆంధ్రప్రదేశ్ కోసం దేనికైనా రెడీ అని పవన్ ప్రగల్భాలు పలుకుతున్నారు. పవన్ రాజకీయ పంథాపై జనసేన శ్రేణుల్లోనే అయోమయం నెలకుంది. పవన్ ముఖ్యమంత్రి కావాలని వారు కుంటున్నారు. కానీ పవన్ మాత్రం జగన్ మినహా చంద్రబాబు, మరెవరైనా సీఎం కుర్చీలో కూచుంటే తనకు అభ్యంతరం లేదన్నట్టుగా వ్యవహరించడం జనసేన కార్యకర్తలు, నాయకులకు నచ్చడం లేదు. తాజా పవన్ రాజకీయ వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనసేన సిద్ధాంతాల్ని వదిలేసి, విద్వేషంతో రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. జనసేన పార్టీ ఏడు మౌలిక సిద్ధాంతాల్ని పవన్‌కు జనం గుర్తు చేస్తున్నారు.
1. కులాలను కలిపే ఆలోచనా విధానం, 2. మతాల ప్రస్తావన లేని రాజకీయం, 3. భాషలను గౌరవించే సాంప్రదాయం, 4. సంస్కృతులను కాపాడే సమాజం, 5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, 6. అవినీతిపై రాజీలేని పోరాటం, 7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం
వీటిలో ఏ ఒక్కదానికైనా కట్టుబడి పవన్ రాజకీయం చేస్తున్నారా? అనే నిలదీత ఎదురవుతోంది. జగన్‌పై అణువణువూ విద్వేషాన్ని నింపుకుని రగిలిపోతున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి నాయకుడిని గతంలో ఎప్పుడూ చూడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన సిద్ధాంతాలు… 1.నిలకడలేని రాజకీయం 2.షూటింగ్ లేని సమయాల్లో వీకెండ్స్ ప్రోగ్రామ్స్‌కు హాజరు కావడం 3.కులాల పరంగా రాజకీయం 4.రాజకీయాల్లో చెప్పులు చూపే సంస్కృతిని తీసుకురావడం 5. జగన్‌పై విద్వేషం 6.చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడం 7.టీడీపీ పల్లకీ మోసేలా జనసేనను సిద్ధం చేయడం
ఇంతకంటే జనసేనాని రాజకీయ పంథా భిన్నంగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధాంతాలను విడిచి, వ్యక్తిగత ద్వేషాన్ని నింపుకుని, దాని కోసం శ్రేణుల్ని వాడుకోవడం ఒక్క పవన్‌కల్యాణ్‌కే చెల్లింది. పార్టీని స్థాపించి పదేళ్లు అవుతున్నా ఇంకా పక్క పార్టీల బలంతో అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు పవన్ తాపత్రయ పడుతున్నారని జనం అంటున్నారు. అందుకే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని గుర్తు చేస్తున్నారు.
భవిష్యత్‌లోనూ చంద్రబాబు ఇంటికి పవన్ వెళుతారని ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఏ మాత్రం సిగ్గు లేకుండా చెబుతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం సంబరానికి ప్రశ్నించడానికని, ఏడు సిద్ధాంతాలని గొప్పలు చెప్పుకోవడం దేనకనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్న జనసేనాని… ముందు తన పార్టీని కాపాడుకోవడంపై దృష్టి సారిస్తే మంచిదనే హిత వచనాలు లేకపోలేదు.