టీడీపీ చేపట్టిన వినూత్న కార్యక్రమం… బాబు ష్యూరిటీ-భవితకు గ్యారెంటీ. ఈ కార్యక్రమంపై వైసీపీ సోషల్ మీడియా ఆడుకుంది. తనకు ష్యూరిటీ ఇస్తే తప్ప జైలు నుంచి బయటికి రాలేని చంద్రబాబు ఇతరులకు ష్యూరిటీ ఇవ్వడం ఏంటనే ప్రశ్న తలెత్తింది. టీడీపీకే గ్యారెంటీ లేదని, ఇక ఆ పార్టీ జనానికి భరోసా ఇవ్వడం ఏంటంటూ వైసీపీ దెప్పి పొడిచింది.
రాజకీయంగా అధికార పక్షం నుంచి ప్రధాన ప్రతిపక్షంపై విమర్శల కోణం ఇది. తాజాగా పొత్తులో భాగంగా సీట్లు ముడి వీడింది. జనసేనకు ఇచ్చే సీట్లు ఎన్నో తేలిపోయింది. చాలా తక్కువ సీట్లకు పవన్‌కల్యాణ్ ఒప్పుకున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అయితే ఇన్ని తక్కువ సీట్లకు పవన్ అంగీకరించడం వెనుక లోపాయికారి ఒప్పందం ఏదో వుందని అందరిలో కలుగుతున్న అనుమానం.
జనసేనను బలిపెట్టి, చంద్రబాబు నుంచి భారీ మొత్తంలో ఇతరేతర లబ్ధి పవన్‌కల్యాణ్ పొంది వుంటారని ఆయన అభిమానులు కూడా అనుమానించే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ సీట్లకు ఒప్పుకున్నట్టు పవన్ చెప్పడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇదే నిజాయతీ టీడీపీ వైపు నుంచి కూడా ఉండాలి కదా అని నిలదీస్తున్నారు.
సీట్లు తగ్గించుకుని, ముఖ్యమంత్రి పదవిలో భాగస్వామ్యం లేకుండా, ఎవరి కోసం, ఎందుకోసం టీడీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా తాము అధికారంలోకి రావాలనే తపనతో రాజకీయాలు చేసే నాయకులను చూస్తుంటారు. అదేంటో గానీ, పవన్‌కల్యాణ్ పంథా మాత్రం అందుకు విరుద్ధంగా వుందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. పాలన లేకపోతే, అధికారంలో ఉన్నోళ్లను దించడం కొత్తేమీ కాదు. తాము అధికారంలోకి రావడానికి ఏం చేయాలో, అది చేయకుండా, ద్వేషంతో రాజకీయాలు చేసే పవన్‌ను ఏమనాలో అర్థం కావడం లేదనే చర్చకు తెరలేచింది.
అధికారంలో ఉన్న వాళ్లని ఓడించి, తమకెందుకు పట్టం కట్టాలో జనానికి చెప్పడం మానేసి, పొంతన లేని కబుర్లు చెబుతున్న టీడీపీ, జనసేన కూటమిని చూస్తే జాలేస్తోందనే విజ్ఞులు లేకపోలేదు. జనసేనకు ఇచ్చిన సీట్లను చూస్తే… ఒక్క విషయం అర్థమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పవన్‌కు చంద్రబాబు ఏదో లబ్ధి చేకూర్చేందుకు ష్యూరిటీ ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే జనసేన భవితకు గ్యారెంటీ లేకపోయినా ఫర్వాలేదని పవన్ తక్కువ సీట్లకు అంగీకరించారనే చర్చకు తెరలేచింది. నిప్పులేనిదే పొగ రాదు కదా! లోగుట్టు పెరుమాళ్లకెరుక. ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకే తెలియాలి. కానీ ఏమీ లేకుండానే జనసేన ఆత్మాభిమానాన్ని టీడీపీకి పణంగా పెడతారని అనుకోలేం. అదేంటో ఎప్పటికీ బయటికొచ్చే పరిస్థితి వుండదు.