చిలకలూరిపేట హడావుడి ముగిసింది. తొలుత అనేక అనుమానాలు సందేహాలు వ్యాప్తి చెందినప్పటికీ ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చాలా సహజంగా ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతున్నదని, వారిని ఓడించాలని పిలుపునిచ్చారు.
ప్రతి చోటా చెప్పిన విధంగానే ఏపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే రాష్ట్రంలో ఎక్కువ అభివృద్ధి సాధ్యమవుతుందని మోడీ అన్నారు. ఇంతవరకు ఆయన చెప్పిన కొత్త సంగతులు ఏమీ లేవు. మొత్తం ప్రసంగాన్ని పరిశీలించినా కూడా ఓటర్లకు ఓటు వేయాలనిపించేంత మూడ్ క్రియేట్ చేయగల విషయాలు ఆయన ప్రసంగంలో ఏమీ లేవు.
మోడీ తన ప్రసంగంలో అగ్రభాగం- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తరఫున ఏయే పథకాలు ఇచ్చామో, ఏ యూనివర్సిటీలను ప్రారంభించామో వివరాలను ఏకబిగిన ఏకరవు పెట్టారు తప్ప.. తమకూ తమ కూటమికి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో సూటిగా చెప్పడంలో ఆయన విఫలం అయ్యారు.
ఇంకా స్పష్టంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రగతి నివేదిక ప్రజలకు సమర్పించడానికి పెట్టిన సభలో మాట్లాడుతున్నట్టుగా మోడీ ప్రసంగం సాగిపోయింది తప్ప, ఎన్నికల ప్రచార సభలో ప్రసంగం లాగా అది లేనేలేదు.
ఈ రాష్ట్రానికి ఆ యూనివర్సిటీలు తెచ్చాం, ఈ యూనివర్సిటీలు తెచ్చాం, ఈ పథకాలు ప్రారంభించాం అన్నారు తప్ప రాబోయే 2024 ఎన్నికలలో గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నాం.. ఈ రాష్ట్రం నుంచి నాకు మెజారిటీ ఎంపీ సీట్లు ఇవ్వండి అలాంటప్పుడు రాష్ట్రం రూపురేఖలు ఏ రకంగా మారుస్తానో చూడండి.. అనే తరహా మాట ఒక్కటి కూడా మోడీ చెప్పనేలేదు. అందుకే ఇది ఎన్నికల ప్రచార సభ కాదని, మోడీ తాను చేసిన పనులను గురించి డప్పు కొట్టుకోవడానికి పెట్టిన ప్రగతి నివేదిక సభ అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగల అవకాశం ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. మన రాష్ట్ర రూపురేఖలు రాబోయే అయిదేళ్లలో మార్చేస్తాం అని తెలుగుదేశం, జనసేన డప్పు కొట్టుకుంటున్నాయి. ఏ రకంగా మార్చబోతున్నారు. మోడీతో కొత్తబంధం వలన.. ఈ రాష్ట్రానికి కొత్తగా వారు ఏం చేయగలమని సంకల్పిస్తున్నారు? వారు చెప్పలేదు. ఈ రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రంనుంచి అనేక హామీల పెండింగ్ ఉన్నాయి.
ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అనేది మోడీకి ఇష్టం ఉండదని అనుకోవచ్చు గాక.. కానీ, కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి గానీ, విశాఖ రైల్వేజోన్ గురించి గానీ.. ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆశ పుట్టించే మాట ఒక్కటైనా మోడీ ఈ సభలో పలికారా అంటే లేనేలేదు. మరి ప్రజలు ఆ కూటమిని ప్రత్యేకంగా ఎందుకు నమ్మి, ఓటు వేయాలనేది బోధపడడం లేదు.