ఎవరీ వెంకాయమ్మ.. ఎందుకీ రచ్చంతా..?

ఎస్సీ మహిళ వెంకాయమ్మ.. జగన్ పై చేసిన వ్యాఖ్యలు తదనంతర పరిణామాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె జగన్ ని విమర్శించిందని, ఆ తర్వాత వైసీపీ నేతలు ఆమెను టార్గెట్…

ఎస్సీ మహిళ వెంకాయమ్మ.. జగన్ పై చేసిన వ్యాఖ్యలు తదనంతర పరిణామాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె జగన్ ని విమర్శించిందని, ఆ తర్వాత వైసీపీ నేతలు ఆమెను టార్గెట్ చేశారని.. వైసీపీ రాజకీయ కక్షసాధింపు ఏ రేంజ్ లో ఉంటుందో చూడండి అంటూ టీడీపీ అనుకూల మీడియా రెచ్చిపోతోంది. కానీ వైసీపీ తరపున వివరణ మాత్రం లేదు. 

సోషల్ మీడియాలో ఎవరో కాస్త క్లారిటీ ఇచ్చారు కానీ అది హైలెట్ కాలేదు. సాక్షి ఇచ్చిన వివరణ కూడా మరుగునపడిపోయింది. వెంకాయమ్మ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇలాంటి వాటితో కాస్త కలకలం సృష్టించొచ్చేమో కానీ.. ఎన్నికల్లో ఓట్లు రాలవు, పైగా జనం చీదరించుకుంటారనే నిజం టీడీపీ తెలుసుకోవాల్సి ఉంది.

గతంలో డాక్టర్ సుధాకర్..

గతంలో మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా ఇలాంటి రాద్ధాంతమే చేశారు. ఆ హడావిడి అంతా అయిపోయాక ఆయన టీడీపీ నాయకుడని, ఆ పార్టీ టికెట్ ఆశించిన నేత అని, ఆ తర్వాత టీడీపీలో క్రేజ్ పెంచుకోడానికి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసి పాపులార్టీ సంపాదించారని తెలిసింది. అయితే ట్రాజిక్ ఎండింగ్. ఆయన చనిపోవడం, దాన్ని కూడా టీడీపీ రాజకీయం చేయాలనుకోవడం జరిగిపోయాయి. కానీ సుధాకర్ వ్యవహారంలో టీడీపీపై సింపతీ పెరగకపోగా.. అలాంటి వారిని కూడా అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని జనం చీదరించుకున్నారు.

ఇప్పుడు వెంకాయమ్మ పరిస్థితి కూడా అంతే. నాకు పింఛన్ రావడంలేదని ఆమె చెప్పింది, కానీ వస్తుందని, ఈ నెల కూడా తీసుకుందని ప్రభుత్వం దగ్గర ఆధారాలున్నాయి. తన పొలం సర్వే చేయడంలేదని ఆమె అధికారుల్ని నిలదీసింది. కానీ అది కోర్టు కేసుల్లో ఉందనే విషయం ఆన్ రికార్డ్ బయటపడింది. 

అంతే కాదు, ఆమె చెప్పిన మాటల్లో ఏదీ వాస్తవం కాదని, కావాలనే టీడీపీ ఆఫీస్ కి వెళ్లి పెద్దలందర్నీ కలిసిందని, ఆ తర్వాత వారి ప్రోద్బలంతో పోలీస్ కేసులు పెట్టి, మరింత రచ్చ చేస్తోందనే విషయం కూడా తెలుస్తోంది.

అంతెందుకు ఈనాడు హెడ్డింగ్ చూడండి.. “నా గొంతు పిసికి, రవికె చించేశారు..” అంటూ మరింత రెచ్చగొట్టే ధోరణిలో వార్తలిచ్చింది. ఇంతకీ ఈ రాద్ధాంతమంతా ఎందుకు, జగన్ ని తిట్టించడానికి చేసిన పని మరీ ఓవర్ కావడంతో పోలీస్ కేసుల వరకూ వచ్చింది. ఇకపై వెంకాయమ్మే కాదు, ఏ సుబ్బాయమ్మ చెప్పినా కూడా జనం నమ్మరు. నిజంగానే ఎవరైనా తనకి పింఛన్ రాలేదని చెప్పినా కూడా నువ్వు ఏ పార్టీ, నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగే పరిస్థితి వస్తుంది. అలా చేసింది చంద్రబాబే.

కేవలం ఆరోపణల కోసం పెయిడ్ ఆర్టిస్ట్ లని, లేదా మానసిక పరిస్థితి సరిగా లేనివారిని తెరపైకి తెచ్చి ప్రభుత్వంపై బురదజల్లాలనుకుంటున్నారు. కానీ ఆ బురద చంద్రబాబు పైనే పడుతోంది.