ఏపీ పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతిలో చేదు అనుభవం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇవాళ మరోసారి మంత్రి నారాయణ దగ్గర కూడా అదే పునరావృతం కావడం గమనార్హం.
వైసీపీ ప్రభుత్వంలో శ్రీలక్ష్మీ కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం మారడంతో జగన్‌కు సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వారిపై కక్ష కట్టినట్టు చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబును కలిసిన శ్రీలక్ష్మి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు. అయితే తీసుకోడానికి ఆయన నిరాకరించారు. అలాగే తన పేషీ నుంచి ఆమెను బయటికి పంపడంతో శ్రీలక్ష్మి అవమానంగా భావించారు.
ఇవాళ మంత్రిగా నారాయణ బాధ్యతలు తీసుకున్నారు. సంబంధిత శాఖ ప్రత్యేక సీఎస్‌గా శ్రీలక్ష్మి హడావుడి చేశారు. బాధ్యతలు తీసుకుంటున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, సంతకం కోసం ఆమె ఫైల్ తీసుకెళ్లారు. అయితే శ్రీలక్ష్మిపై అనధికార నిషేధాన్ని విధించిన నేపథ్యంలో, ఇప్పుడు సంతకాలు చేసేవేవీ లేవంటూ సున్నితంగానే మంత్రి నారాయణ తిరస్కరించారు. దీంతో శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
అలాగే జీవోలపై శ్రీలక్ష్మి సంతకం ఉండకూడదని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. దీంతో అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభానికి సంబంధించిన జీవోపై కూడా శ్రీలక్ష్మి సంతకం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతోనే జీవో విడుదల కావడం గమనార్హం. ఒకట్రెండు రోజుల్లో జగన్ అనుకూల ఉన్నతాధికారులంతా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు రావచ్చని ప్రచారం జరుగుతోంది.