మళ్లీ తెరపైకి ఎన్టీఆర్.. ఈసారి ఫ్లెక్సీ కలకలం

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కూడా పరోక్షంగా స్పష్టం చేశాడు. అయినప్పటికీ అతడి అభిమానులు, కొంతమంది టీడీపీ నేతలు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్…

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కూడా పరోక్షంగా స్పష్టం చేశాడు. అయినప్పటికీ అతడి అభిమానులు, కొంతమంది టీడీపీ నేతలు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. జెండాలు ఎగరేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ కు ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఎప్పటికప్పుడు నిరసనల సెగ తగులుతూనే ఉంది.

తాజాగా మరోసారి ఎన్టీఆర్ పై ఫ్లెక్సీ వెలిసింది. ఈసారి కేవలం ఫ్లెక్సీ పెట్టి ఊరుకోలేదు. లోకేష్ ను గిచ్చేలా, కవ్విస్తూ ఓ స్టేట్ మెంట్ కూడా ఉంచారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు ఒంగోలులో కలకలం రేపుతున్నాయి. నారా లోకేష్, ఒంగోలులోకి ప్రవేశిస్తున్న వేళ, ఈ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి.

“అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే” అనే క్యాప్షన్ తో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఏదో ఒక చోటు కాదు, నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఈ క్యాప్షన్ లో అసలోడు అంటే ఎన్టీఆర్, కొసరోడు అంటే లోకేష్ అని అర్థం. ఎన్టీఆర్ వచ్చేంతవరకు, లోకేష్ పండగ చేసుకోవచ్చని, ఆ తర్వాత లోకేష్ ఇంటికే అనేది దీని నిగూడార్థం.

ఫ్లెక్సీ స్టయిల్ చూస్తుంటే.. ఎన్టీఆర్ అభిమానులు కాకుండా, తెలుగుదేశం నేతలు లేదా కార్యకర్తలే ఈ ఫ్లెక్సీలు వేయించినట్టు కనిపిస్తోంది. ఎందుకుంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు వేస్తే అందులో చంద్రబాబుకు చోటుండదు. కానీ తాజా ఫ్లెక్సీలో చంద్రబాబు, పెద్ద ఎన్టీఆర్ బొమ్మలతో పాటు, సైకిల్ గుర్తు కూడా వేశారు. ఈ స్టయిల్ కచ్చితంగా టీడీపీ నేతలదే.

నిజానికి చంద్రబాబు, లోకేష్ కు 'ఎన్టీఆర్ సెగ' కొత్తేంకాదు. స్వయంగా కుప్పంలోనే చంద్రబాబు ఎదురుగా గద్దెపై ఎన్టీఆర్ జెండా ఎగరేశారు ఫ్యాన్స్. ఇక లోకేష్ పాదయాత్ర టైమ్ లో చాలా చోట్ల 'ఎన్టీఆర్ సీఏం' అనే నినాదాలు వినిపించాయి. ప్రారంభంలో వీటితో చంద్రబాబు-లోకేష్ కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఇప్పుడు ఆ ఇబ్బందుల మధ్యే తమ పనులు తాము చేసుకుపోతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి చూసీచూడనట్టు వెళ్లిపోతున్నారు.