రామోజీ ఆద‌ర్శాలు పాటిస్తున్నారా?.. బ‌హిరంగ లేఖ‌!

ఈనాడు గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావు నీతులు, ఆద‌ర్శాలు వ‌ల్లించ‌డానికే త‌ప్ప‌, ఆచ‌రించ‌ర‌నే విమ‌ర్శ చాలా కాలంగా వుంది. రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు గిట్ట‌ని వారిపై య‌థేచ్ఛ‌గా వ్య‌తిరేక క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం, అలాగే త‌న…

ఈనాడు గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావు నీతులు, ఆద‌ర్శాలు వ‌ల్లించ‌డానికే త‌ప్ప‌, ఆచ‌రించ‌ర‌నే విమ‌ర్శ చాలా కాలంగా వుంది. రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు గిట్ట‌ని వారిపై య‌థేచ్ఛ‌గా వ్య‌తిరేక క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం, అలాగే త‌న చాన‌ల్‌లో ప్ర‌సారం చేయ‌డం రామోజీకి వెన్న‌తో పెట్టిన విద్య అని చాలా మంది చేసే విమ‌ర్శ‌నే మాజీ ఎమ్మెల్యే, ఏపీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మ‌న్ గోనె ప్ర‌కాశ్‌రావు లేఖ ద్వారా వెల్ల‌డించారు.

రామాజీరావుపై అక‌స్మాత్తుగా గోనెకు ఆగ్ర‌హం వుంది. ఈ సంద‌ర్భంగా ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. నీతులు, ఆదర్శాలు ఇతరులకు చెప్పడం మాత్రమే కాదు వీటిని వల్లించేవారు ఖచ్చితంగా పాటించినప్పుడే వారు చెప్పే మాటలకు విలువ ఉంటుందంటూ లేఖ ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. “సంఘానికి మేము మార్గదర్శకులం”, సమాజం శ్రేయస్సు కోసం పాటు పడుతున్నట్లు మీకు మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాకుండా మీరు నడుపుతున్న వ్యాపార సంస్థల్లో, మీ నిత్యజీవితంలో అవి పాటిస్తున్నారా? లేదా అన్నది ప్రధాన అంశ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మిమ్మల్ని, మీ పనితీరును, మీరు నిత్యం వల్లించే నీతులను గత 40 సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉన్న ఒక పౌరుడిగా వీటిని గమనిస్తున్న వ్యక్తిగా కొన్ని ప్రధానమైన అంశాలను ఈ బహిరంగ లేఖ ద్వారా మీ దృష్టికి, ప్రజలకు తీసుకురాదలిచాన‌ని గోనె తెలిపారు.
 
ఇతరుల విషయంలో మీరు పాటించే సూత్రాన్ని మీ వ్యాపార సంస్థ విషయంలో మీరు అమలు చేయకపోవడాన్ని మాత్రం రాష్ట్రప్రజలు, బాధ్యతగల ఏ ఒక్క పౌరుడు మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండలేర‌ని ఆయ‌న తెలిపారు. వీటిని ప్రజలు క్షమించరని ఆయ‌న హెచ్చ‌రించారు.

మీరు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీలో బలహీన వర్గాలకు చెండాల్సిన 14 ఎకరాల 30 గుంటల భూమి గత 15 సంవత్సరాలుగా మీ అధీనంలో ఉంద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందింద‌ని వెల్ల‌డించారు.  ఈ భూమిని పేదలకు అందకుండా వారికి తీరని ద్రోహం చేస్తున్నారని రామోజీని విమ‌ర్శించారు.

నాగన్‌ప‌ల్లి రెవెన్యూ విటేజ్ సర్వే నెం. 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత నేత డా.వై.ఎస్.రాజశేఖర‌రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 606 మంది బలహీనవర్గాలకు 200 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు కేటాయించిన విషయం మీకు విధితమే అని ఆయ‌న గుర్తు చేశారు. ఈ పట్టాలు నాగన్‌ప‌ల్లి-150, ముక్కునూర్- 33, రాయపోలు – 274, పోల్కంపల్లి-149 ప్రజలకు మొత్తం 606 ల మందికి ఇచ్చిన విష‌యాన్ని రామోజీకి గుర్తు చేశారు.

రాజకీయ, అధికార పలుకుబడితో గత 15 సంవత్సరాలుగా పేదలకు చెందాల్సిన ఈ భూమిని వారికి చెందకుండా  అడ్డుకుంటు న్నార‌ని రామోజీకి తెలియ‌జెప్పారు. లోకంలో జరిగే ప్రతీ సమస్యను, ప్రభుత్వాలే చేసే తప్పదాలను ఎత్తిచూపి నీతులు వల్లించే మీరు పేదలకు చెందాల్సిన ఈ భూమిని వారికి చెందకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని రామోజీని ఆయ‌న నిల‌దీశారు.  

అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ రహదారిని ఆక్రమించిన విషయం అందరికి తెలిసిందే అని ఆయ‌న పేర్కొన్నారు.  ప్రభుత్వ రహదారిని ఆక్రమించడం వల్ల దాదాపు 16 గ్రామాల్లోని 90 వేల మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడటమే కాకుండా ఈ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మీరు ప్రభుత్వ రహదారి ఆక్రమించకపోయి ఉంటే ఇక్కడ ఎకరం 4 నుండి 5 కోట్ల రూపాయలు పలకాల‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు. రహదారి ఆక్రమించడం వల్ల ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూమి ధరలు కోటి రూపాయలకు మించి లేద‌ని ఆయ‌న వాపోయారు.

ఇప్పటికైనా మీరు బేషజాలకు, పట్టుదలకు, అహంకారానికి పోకుండా ప్రజల శ్రేయస్సు కోసం లేవనెత్తుతున్న ఈ అంశాలపై వెంటనే స్పందించి  తప్పులను సరిదిద్దుకోవాలని రామోజీని ఆయ‌న సవినయంగా కోరుకున్నారు. అలాగే మార్చి 31వ తేదీ లోపు ఆక్ర‌మించిన ప్ర‌భుత్వ ర‌హ‌దారిని విడిచి పెట్టాల‌ని, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అందించేందుకు అడ్డంకులు క‌లిగించ‌కూడ‌ద‌ని ఆయ‌న కోరారు.  లేనిపక్షంలో గాంధేయ పద్ధతిలో శాంతియుతంగా ఈ ప్రాంత ప్రజలు, వివిధ ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమిస్తాన‌ని గోనె ప్ర‌కాశ్‌రావు హెచ్చ‌రించారు.