జనసేనాని పవన్‌కల్యాణ్ అక్కసు మామూలుగా లేదు. జగన్ ప్రభుత్వం వెంటనే దిగిపోతే తప్ప ఆయనకు నిద్ర పట్టేలా లేదు. ఒకవేళ మరోసారి జగన్ అధికారంలోకి వస్తే పవన్‌కల్యాణ్ మానసిక పరిస్థితి ఊహించడానికే భయమేస్తుంది. కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన జగన్ ప్రభుత్వం… త్వరలో కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
గతంలో కూడా అనేక మార్లు పవన్‌కల్యాణ్ జోస్యాలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ అధికారంలోకి రారు, రానివ్వనని ఆయన బల్లగుద్ది మరీ చెప్పిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్లు విస్తరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కొన్ని ఇళ్లను తొలగించాల్సి వచ్చింది. ఇదే పవన్‌కల్యాణ్ ఆగ్రహానికి కారణమైంది.
జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందువల్లే కక్షకట్టి జేసీబీలతో నిర్దాక్షిణ్యంగా ఇళ్లు కూల్చి వేశారని పవన్ మండిపడ్డారు. వైసీపీకి ఓటు వేసిన వారికి అనుకూలంగా ఒకలా, వేయని వారిని శత్రువులుగా చూస్తూ వేధింపులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అరాచకానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
ఆ గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంటే ఇంకా విస్తరణేంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటం గ్రామస్తుల ప్రజా పోరాటానికి, న్యాయ పోరాటానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటంలో ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన జనసైనికులు, వీరమహిళలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. రెండు రోజుల క్రితం ఇప్పటం గ్రామానికి నాదెండ్ల మనోహర్ వెళ్లినపుడు కరెంట్ సరఫరా నిలిపేసి తమ కుసంస్కారాన్ని ప్రదర్శించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరం లేదని ఆయన శాపనార్థాలు పెట్టారు.