డబ్బులు పంచడానికి సిద్ధమైన పవన్ కల్యాణ్?

జీరో బడ్జెట్ రాజకీయం.. చాలా ఏళ్లపాటు జనసేనాని వినిపించిన సోలో సాంగ్ ఇది. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా గెలవాలో, ఎలా రాజకీయం చేయాలో తమ పార్టీ చేసి చూపిస్తుందని గతంలో గొప్పలు చెప్పారు…

జీరో బడ్జెట్ రాజకీయం.. చాలా ఏళ్లపాటు జనసేనాని వినిపించిన సోలో సాంగ్ ఇది. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా గెలవాలో, ఎలా రాజకీయం చేయాలో తమ పార్టీ చేసి చూపిస్తుందని గతంలో గొప్పలు చెప్పారు పవన్ కల్యాణ్. తనతో పాటు తన అభ్యర్థులెవ్వరూ ఎన్నికల వేళ డబ్బులు పంచరని కూడా చాలాసార్లు అన్నారు.

కానీ క్షేత్రస్థాయిలో అలా జరగలేదనే విషయం అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ స్థాయిలో కాకపోయినా, జనసేన అభ్యర్థులు కూడా డబ్బులు పంచారనేది బహిరంగ రహస్యం. ఈ అంశంపై ఇన్నాళ్లకు పవన్ కు జ్ఞానోదయం అయినట్టుంది. డబ్బులు పంచకుండా రాజకీయాలు కష్టమని ఓపెన్ గా చెబుతున్నారు.

“ఎలక్షన్ కమిషన్ కూడా అభ్యర్థి ఎన్నికల ఖర్చును పెంచింది. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకుండా రాజకీయం చేసేద్దాం అంటే కుదరదు. కనీసం భోజనాలైనా పెట్టాలి. జనసేన నాయకులందరికీ నేను ఇదివరకే చెప్పాను. అందరూ డబ్బులు ఖర్చుపెట్టాల్సిందే. ఓట్లు కొనమని నేను చెప్పను. జనసేన నాయకులు ఎవరికి వారు ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. బాగా పనిచేయండని మాత్రమే నేను చెబుతాను. అసలు ఓట్లు కొనలేని పరిస్థితిలో అభ్యర్థి ఎవరైనా ఉంటే మరీ సంతోషం.”

ఇదీ పవన్ కల్యాణ్ తాజా సందేశం. బాగా పనిచేయమని మాత్రమే పవన్ చెబుతారంట, క్షేత్రస్థాయిలో మాత్రం ఖర్చు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అలాంటి అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని పరోక్షంగా సంకేతాలిస్తున్నారు.

అభ్యర్థులంతా వేలకు వేల కోట్లు ఖర్చుపెడతారని, కానీ ఎవ్వరూ దాని గురించి మాట్లాడరని.. చివరికి తనుకు కూడా అన్నీ తెలిసినప్పటికీ కామ్ గా కూర్చొని చూడాల్సి వస్తోందన్నారు పవన్. ఇలా అందరం ఓ అందమైన అబద్ధంలో బతుకుతున్నామని అంటూనే.. డబ్బుల్లేకుండా రాజకీయాలు చేయాలని తను ఏ రోజూ చెప్పలేదంటూ మాట మార్చారు.