ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వెరీవెరీ బిజీ. ప్లాస్లిక్ వస్తువుల వాడకంపై, అలాగే వినాయక చవితి వేడుకల్లో మట్టి బొమ్మల వినియోగం, అలాగే ఉత్సవాల్లో పర్యావరణ హిత వస్తువులను వాడకంపై ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాల్లో పవన్‌కల్యాణ్ తలమునకలై ఉన్నారు. జనసేన రాజకీయ లక్ష్యాల్లో పర్యావరణ పరిరక్షణ ఒకటి. ఈ క్రమంలో ఏరికోరి పవన్‌కల్యాణ్ పర్యావరణ మంత్రిత్వ శాఖను కూడా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ పిఠాపురం, కాకినాడ ప్రాంతాల్లో తిష్ట వేశారు. పరిపాలనపై అవగాహన పెంచుకోడానికి అంటూ ఆయన ఇతరేతర అంశాల్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు చంద్రబాబునాయుడు ఏపీ విభజన సమస్యల పరిష్కారం నిమిత్తం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి వచ్చారు. అలాగే అమరావతి, పోలవరం, తాజాగా విద్యుత్ రంగంపై చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు.
ఏ ఒక్క దానిపై కూడా పవన్‌కల్యాణ్ స్పందించలేదు. తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. కానీ గ్రామీణ, పంచాయతీరాజ్ వ్యవస్థలపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఉచిత ఇసుకపై ఆరోపణల్ని కూడా ఆయన పట్టించుకోవడం లేదు. జనసేన నాయకుల వ్యవహార శైలి, తాము తీసుకున్న బాధ్యతల వరకే ఆయన పరిమితం కావడం చర్చనీయాంశమైంది. పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఆయన వ్యూహం ఏంటో రానున్న రోజుల్లో తెలియనుంది.