రాజకీయాల్లో డబ్బు ఖర్చుపై జనసేనాని పవన్‌కల్యాణ్ గేట్లు ఎత్తేశారు. ఇంతకాలం ఎన్నికల్లో డబ్బు వినియోగంపై పవన్‌కల్యాణ్ స్వీయ నిబంధనలు పెట్టుకోవడం తెలిసిందే. నీతివంతమైన రాజకీయాలు చేయడానికి వచ్చానంటూ, జీరో బడ్జెట్ పాలిటిక్స్‌పై పదేపదే పవన్ హితబోధ చేస్తూ వచ్చారు.
అయితే రాజకీయ ప్రవాహంతో పాటు కొట్టుకుపోతే తప్ప మనుగడ ఉండదని ఆయన గ్రహించినట్టున్నారు. విలువల గురించి మాట్లాడుకోడానికి బాగా వుంటుందని, అయితే ఆచరించే వాళ్లకు మంచి పేరు తప్ప దాని వల్ల ఒరిగేదేమీ లేదనే సత్యాన్ని ఆయన గ్రహించినట్టున్నారు.
ప్రస్తుతం రాజకీయాలు డబ్బుమయమయ్యాయి. ఓటుకు నోటు ఇచ్చే వారికే విజయం అన్న రీతిలో వ్యవస్థ పతనమైంది. ఇది మరింత దిగజారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్‌కల్యాణ్ పార్టీకి కొన్నిచోట్ల ప్రజాదరణ ఉందనే వాస్తవాన్ని విస్మరించకూడదు. అయితే ఆ పార్టీ అభ్యర్థులు కనీసం కూడా ఎన్నికల్లో ఖర్చు చేయని పరిస్థితి. అంతెందుకు స్వయంగా పవన్ నిలిచిన రెండు చోట్ల కూడా డబ్బు పంపిణీ చేయకపోవడం, ప్రత్యర్థులు భారీ మొత్తంలో ఓట్లను కొనుగోలు చేశారనే ప్రచారం సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌కు ఎన్నికలపై జ్ఞానోదయం అయ్యినట్టుంది. అందుకే ఎన్నికల్లో ఖర్చు చేయాలని నేరుగా చెప్పేశారు. జనసేన ఐటీ విభాగపు ముగింపు సమావేశంలో పవన్ మాట్లాడుతూ…. జీరో బడ్జెట్ రాజకీయం చేయమని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఓట్లు కొనకూడని రాజకీయమే చెప్పానన్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన పెద్దస్థాయి నాయకులు కూడా రూపాయి ఖర్చు పెట్టలేదని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఇక మీదట ఎన్నికల్లో నిలిచే అభ్యర్థులెవరైనా ప్రత్యర్థులకు పోటీగా ఖర్చు చేయాలని చెప్పకనే చెప్పారు. అప్పుడే ఎన్నికల్లో రాణించగలుగుతామని మనసులో మాటను బయటపెట్టారు. జనసేన అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టని పార్టీగా ఓటర్ల మనసులో ముద్ర పడింది. దీంతో ఆ పార్టీపై అభిమానం వున్న వాళ్లు కూడా… డబ్బు ఇచ్చిన పార్టీలకు ఓట్లు వేస్తున్న పరిస్థితి.
జనసేన ఘోర పరాజయానికి కారణాలను విశ్లేషించుకునే క్రమంలో ఈ సంగతులు పవన్ దృష్టికి వెళ్లినట్టున్నాయి. అందుకే ఆయన మాటతీరులో మార్పు అని అభిమానులు చెబుతున్నారు.