ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీల అధినేతలు బిచ్చగాళ్ళై పోతారు. వాళ్ళ దగ్గర డబ్బుకు కొదవ ఉండదు. కానీ ఓట్లు కావాలి కదా. అందుకే అడుక్కోక తప్పదు. ఎంతటి కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడికైనా ఇది తప్పదు. తమను అధికారంలోకి తీసుకురావాలని దీనంగా బతిమాలుకుంటారు. దానికి తగ్గట్లుగానే వారి భాష కూడా ఉంటుంది.
ఏపీ విషయానికొస్తే రాష్ట్రం విడిపోయాక 2014 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయి ఏపీ ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే మంచి జరుగుతుందని అనుకున్నారు. పైగా ఆయన అనుభవజ్ఞుడు. ప్రధానంగా ఈ కారణంతోనే ఆయనకు అధికారం అప్పగించారు.
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఒక్క ఛాన్స్ …ప్లీజ్ అని వేడుకున్నారు. సరేనని ఆయనకు అధికారం అప్పగించారు. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే గత ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని బతిమాలుకున్న జగన్ ఇప్పుడు ధీమాగా ఉన్నారు. మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని గట్టిగా నమ్ముతున్నారు.
ఇప్పుడు అడుక్కునేవాళ్ళు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. సరే …పవన్ సంగతి తెలిసిందే కదా. ఎప్పుడు ఏం చేస్తాడో , ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్ధం కాదు. ఆయన వ్యూహాలు ఏంటో అంతుబట్టవు. ఆ విషయం అలా వదిలేస్తే ఇప్పుడు జోరుగా అడుక్కునే పనిలో బిజీగా ఉన్నారు.
ఒక్కసారి జనసేనకు అధికారం ఇచ్చి చూడాలనీ, ఏపీని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఏ వ్యూహమైనా వేస్తానన్నారు పవన్ కళ్యాణ్. “పిఠాపురం సాక్షిగా.. దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నా.. నాకు అధికారం ఇవ్వండి. మిమ్మల్ని అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి” అని పవన్ విజ్ఞప్తి చేశారు. తనకు క్రిమినల్స్ అంటే చిరాకు అన్న పవన్ కళ్యాణ్… “నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వీళ్లా మనల్ని పాలించేది. గూండాగాళ్లు, రౌడీలు, హంతకులు… సిగ్గుండాలి మనకు ఇలాంటి వాళ్లు పాలించేలా చేసుకోవడానికి” అని విరుచుకుపడ్డారు పవన్.
“పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నాను అన్నారు. దత్తాత్రేయ అంశలోని శ్రీపాద వల్లభుడు క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురం నుంచి అర్థిస్తున్నాను అన్నారు. రాష్ట్ర బాధ్యత తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
వారాహిలో యాత్ర చేస్తున్న జనసేనాని అధికార వైసీపీ మీద దారుణంగా విరుచుకు పడ్డారు. అదంతా చెప్పుకుంటూ పొతే మహా భారతమవుతుంది. ఆయన ఒకటే వేడుకుంటున్నాడు తనను సీఎం ను చేయాలని. వేడుకోవడం బాగానే ఉంది కానీ తన పార్టీకి అంత మెజారిటీ అంటే సీఎం అయ్యేంత మెజారిటీ వస్తుందా అని ఆయన ఆలోచిస్తున్నారా? మెజారిటీ వస్తే సీఎం కాకుండా అడ్డుకునేవారు ఎవరూ ఉండరు.