ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే పవన్‌కల్యాణ్ విపరీతంగా భయపడుతున్నారని జనసేన నాయకుల మాటలు చెబుతున్నాయి. పవన్ భయం ఏ స్థాయిలో వుందంటే… తాను పోటీ చేసే నియోజకవర్గం గురించి ముందే ప్రకటిస్తే, జగన్ ఎలాగైనా ఓడిస్తాడని జనసేనాని ఆందోళన చెందుతున్నారు. పవన్ భయపడడాన్ని చూస్తే… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని రహస్యంగా పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక ప్రభుత్వ పరంగా నిధులు ఖర్చు చేసే పరిస్థితి వుండదని జనసేన నాయకులు అంటున్నారు. అంతేకాదు, జగన్ ఏం చేస్తారో అనే భయంతో తమ నాయకుడు ఈ దఫా కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడని జనసేన నాయకులు అంటున్నారు. జనసేన నాయకుల భయం చేసుకోవాల్సిందే.
ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ నిలిచిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో వైసీపీ ఓడించింది. అప్పటి నుంచి ఒంటరిగా బరిలో దిగితే గెలవలేననే భయం పవన్‌ను వెంటాడుతోంది. బహుశా టీడీపీతో పొత్తు కుదుర్చుకోడానికి ఓటమి భయం కూడా కారణం కావచ్చు. అందుకే ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని పవన్ బహిరంగంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పవన్ పోటీపై సస్పెన్స్‌కు వ్యూహం అని జనసేన ముద్దు పేరు పెట్టుకుంది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఒకే ఒక్క విషయాన్ని అడగొద్దని మీడియా ప్రతినిధులను జనసేన నాయకులు అభ్యర్థిస్తున్నారు. ఈ దఫా పవన్ ఓడిపోతే ఇక ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలికినట్టే. అందుకే తానైనా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పవన్ పడరాని పాట్లు పడుతున్నారు.