ఉత్తరాంధ్రా మీద ఒక్కో పార్టీ దృష్టి పెడుతూ వస్తోంది. ఉత్తరాంధ్రా ఈసారి ఏపీ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే స్థితిలో ఉందని భావిస్తున్నారు. గ్రేటర్ రాయలసీమలో వైసీపీ పై చేయి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరులలో టీడీపీ జనసేన కూటమి ఆధిక్యం ప్రదర్శించవచ్చు అన్నది అంచనాగా ఉంది.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేయాలన్నా ఉత్తరాంధ్రాలోని 34 సీట్లే కీలకంగా మారుతున్నాయి. అందుకే అందరి కంటే ముందే వైసీపీ ఉత్తరాంధ్రా పైన చూపు సారించింది. పదే పదే ఉత్తరాంధ్రా గురించి వైసీపీ మాట్లాడుతూ వచ్చింది.
విశాఖ పాలనా రాజధాని అన్న నినాదం కూడా అందులో భాగమే. వైసీపీ ఎన్నికల శంఖారావం కూడా ఉత్తరాంధ్రాలోనే నిర్వహించింది. విశాఖ జిల్లా భీమిలీలో జరిగిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది. ఉత్తరాంధ్రాలో ఆ విధంగా ఎన్నికల పోరులో వైసీపీ పై చేయి సాధించినట్లు అయింది.
ఇప్పుడు జనసేన వంతు అంటున్నారు ఫిబ్రవరి 4న పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రా పర్యటన ఉంది. ఆయన ఆ రోజున ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా ఇదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు
కాంగ్రెస్- వైసీపీ- టీడీపీల ప్రస్తానం తరువాత జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ ఆ రోజున తన సొంత ప్రాంతం అయిన అనకాపల్లి వేదికగానే పవన్ సమక్షంలో జనసేన కండువా అభిమాన జనం మధ్యలో కప్పుకుంటారు అని అంటున్నారు.
అనకాపల్లి ఎంపీ సీటుతో పాటు ఆ పార్లమెంట్ పరిధిలో కొన్ని సీట్లు ఆశిస్తున్న జనసేన ఆ రోజున ఒక విధంగా తన సత్తాను చాటేలా మీటింగ్ నిర్వహించబోతోంది. జగన్ సిద్ధం సభ తరువాత ఉత్తరాంధ్రా వస్తున్న తొలి పార్టీ జనసేన తరఫున పవన్ ఏ విధంగా మాట్లాడుతారు అన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది. జనసేనలో మరిన్ని కొత్త చేరికలు ఉంటాయా అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది.