ఇప్పుడంతా ఫిరాయింపుల సీజను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల సంగతి తేలుస్తూ ఉన్న సమయంలో.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే స్థాయి వారు మాత్రమే కాకుండా చిన్నా సన్నా స్థాయి నాయకులు కూడా బయటకు వస్తున్నారు. ఇలాంటి వారు జగన్ ను నానా మాటలు అనడం.. తాము చేరబోయే కొత్త పార్టీని ప్రస్తుతానికి కీర్తించడం ఇదంతా మామూలే.
అయితే ప్రత్యేకించి తెలుగుదేశంలో చేరడానికి వస్తున్న కొందరు నాయకులను గమనిస్తే.. ఆశ్చర్యం కలుగుతోంది. రకరకాల సమీకరణాల కారణంగా.. జనసేనలో చేరవలసిన నాయకులు కొందరు తెలుగుదేశంవైపు వస్తున్నారు. ఇలాంటి వారందరూ కూడా పవన్ కల్యాణ్ స్కెచ్ మేరకే తెలుగుదేశంలోకి వస్తున్నారనే వాదన వినవస్తోంది.
వీళ్లందరూ చంద్రబాబునాయుడుకు పవన్ కల్యాణ్ అందిస్తున్న నకిలీ గిఫ్టులని, ఒక రకంగా తెలుగుదేశంలోకి ఆయన ప్రవేశపెడుతున్న కోవర్టులు అనే వాదన వినవస్తోంది. సుదూర భవిష్యత్ ఆలోచనలతోనే పవన్ కల్యాణ్ ఇలా చేస్తున్నారనే అభిప్రాయాలు విశ్లేషకుల్లో వ్యక్తం అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ ను ఆశ్రయిస్తున్న కొందరు నాయకులను ఆయనే స్వయంగా తెలుగుదేశంలోకి పంపుతున్నారేమో అనే అనుమానాలు ప్రజలకు పుడుతున్నాయి. ఒక కులం వాళ్లందరూ పవన్ ను ఆశ్రయిస్తుండగా.. తమ పార్టీ మీద కులం ముద్ర పడిపోకుండా ఉండేందుకు ఆయన ఇలా చేస్తున్నారని సమాచారం.
అలాగే తన ఆశ్రితులు కొందరిని తెలుగుదేశంలోకి పంపి అక్కడ టికెట్లు ఇప్పించుకుంటే.. భవిష్యత్తులో కూటమిలో తన గళానికి బలం ఎక్కువగా ఉంటుందనే వ్యూహం కూడా పవన్ కల్యాణ్ లో ఉన్నట్టుగా ఉంది. పైగా కూటమిలో తమ పార్టీకి సీట్లు తక్కువగా దక్కినా.. తనవారు కొందరికి తెలుగుదేశం టికెట్లు దక్కుతాయనేది ఇంకో ఆలోచన.
నిజానికి ఇవన్నీ చంద్రబాబు తెలివితేటలే. గతంలో చంద్రబాబునాయుడు ఇలాంటి వ్యూహాలే అనుసరించేవారు. ఆయనదగ్గర నుంచి నేర్చుకున్న పాఠాన్నే పవన్ కల్యాణ్ ఆయనమీదే ప్రయోగిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.
గతంలో పవన్ కల్యాణ్ కు ఎంతో సన్నిహితుడైన కామినేని శ్రీనివాస్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలనుకున్నప్పుడు.. తొలుత పవన్ నే ఆశ్రయించారు. ఆయన చంద్రబాబును సంప్రదించారు. కామినేని బిజెపిలో చేరితే.. ఆయన కోరుకున్న సీటును బీజేపీకి కేటాయిస్తామని చంద్రబాబు అడ్డదారి సూచించారు. ఆ రకంగా ఆయన బిజెపి తరఫున గెలవడం, చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది.
బిజెపిని వీడదలచుకున్న తర్వాత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. కన్నా జనసేన వైపు మొగ్గుచూపగా.. పవన్ వారించి తెదేపాలోకి పంపినట్లు పుకార్లున్నాయి. బిజెపితో పొత్తు ఉన్నందున అక్కడినుంచి జనసేనలోకి రావడం కంటె.. కన్నాను తెదేపాలోకి పంపి గెలిపించుకుంటే.. ఎక్కడున్నా తన మనిషిగానే ఉంటాడనేది పవన్ వ్యూహం.
ఇప్పుడు కూడా.. తెలుగుదేశంలోకి జరుగుతున్న కొన్ని చేరికలను చూస్తే.. పవన్ కల్యాణ్ ప్రోద్బలమే వెనుక ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇలాంటి పవన్ కోవర్టుల సంఖ్య పెరుగుతుందేమో.. చంద్రబాబు జాగ్రత్తగా గమనించుకోవాలి.