వచ్చిన అవకాశాన్ని చాలా సమర్థంగా ఉపయోగించుకోవడం గురించి జనసేనాని పవన్ కల్యాణ్ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించిన కార్యకర్తలకు బుద్ధి చెప్పినందుకు.. ఇప్పుడు ఆయన నిరసనలు వ్యక్తం చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు.
వచ్చే ఎన్నికలలో ఉభయగోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కకుండా చేసేందుకు తన వారాహి రెండో విడత యాత్రను కూడా ఆ జిల్లాలలోనే కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త నిర్ణయానికి వచ్చారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకుడి మీద సిఐ అంజుయాదవ్ చేయి చేసుకున్న నేపథ్యంలో ఆయన తన ప్రతిస్పందనను ఘాటుగా తెలియజేయదలుచుకున్నారు. తమ పార్టీ నాయకుడి మీద దెబ్బ పడితే తన మీద పడినట్లే అని హూంకరిస్తున్న జనసేనాని ఈ అంశాన్ని మరింతగా హైలైట్ చేయాలని భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జనసేన నాయకుడి మీద దెబ్బ పడిన రోజునే పవన్ కళ్యాణ్.. ‘నేనే వచ్చి అదే శ్రీకాళహస్తిలో ధర్నా చేస్తా.. నన్ను కొట్టండి చూద్దాం’ అంటూ అక్కడి సిఐ అంజు యాదవ్ కు సవాలు విసిరారు. ఆ సమయానికి అది ఆవేశంగా చెప్పిన మాట మాత్రమే అయి ఉండవచ్చు గాక. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నదనే సంగతిని మరింతగా హైలైట్ చేయాలంటే శ్రీకాళహస్తి ఘటనను ఉద్యమంగా మార్చాల్సిందేనని పార్టీ నిర్ణయించింది.
పవన్ కళ్యాణ్ స్వయంగా శ్రీకాళహస్తి వెళ్లి అక్కడి కార్యక్రమంలో పాల్గొనాలని వారు ప్లాన్ చేశారు. ప్రస్తుతం వారాహి 2 యాత్ర నడుస్తోంది. ఇది పూర్తయిన తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒకటి రెండు రోజులు సంస్థాగత సమీక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని.. ఆ తరువాత శ్రీకాళహస్తిలో ధర్నా చేయాలని పార్టీ భావిస్తోంది.
నిజానికి శ్రీకాళహస్తిలో కేవలం ధర్నా అయితే ఏ వివాదమూ రేకెత్తి ఉండేది కాదు.. పార్టీ నాయకులు అనుమతి లేకుండా సీఎం దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించినందువల్లనే రభస జరిగింది. పవన్ కల్యాణ్ నిరసన తెలియజేయడానికి శ్రీకాళహస్తి వెళ్లి అక్కడ ధర్నా మాత్రమే చేస్తారా? లేదా, తానే స్వయంగా సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనంచేసి తన తడాఖా చూపిస్తారా, అలాంటి ప్రయత్నం చేస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఖచ్చితమైన తేదీని ఇంకా నిర్ణయించలేదని సమాచారం. మొత్తానికి తాను పోలీసు కుటుంబం నుంచే వచ్చానని, పోలీసు వ్యవస్థ అంటే తనకు ఎంతో గౌరవం అని పదేపదే సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండే పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి వేదిక పోలీసు వ్యవస్థ మీద దాడికి దిగుతారని పార్టీ వర్గాల బోగట్టా!