జనసేనాని పవన్‌కల్యాణ్ తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగనే ప్రత్యర్థి అని భావిస్తుంటారు. కానీ పవన్‌ను జగన్ మాత్రం ఆ కోణంలో ఎప్పుడూ చూడరు. చంద్రబాబు దత్త పుత్రుడిగా, టీడీపీ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిగా పవన్‌ను జగన్ చూస్తారు. అందుకే పవన్ పేరు ప్రస్తావించకుండానే దెప్పి పొడుస్తుంటారు.
మరోవైపు టీడీపీ షెడ్యూల్‌ని పవన్ చక్కగా అమలు చేస్తారనే విమర్శను ఎదుర్కొంటున్నారు. జగన్‌ను ఎదుర్కోవాలంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని పవన్ తరచూ పిలుపు ఇస్తుంటారు. లేదంటే జగన్‌ను ఎదుర్కోలేమంటూ పవన్ తన మిత్రులను భయపెడుతుంటారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం వుంది.
ఇప్పటికీ పవన్ తన పార్టీని బలంగా నిర్మించుకోవాలని అనుకోవడం లేదు. ఎంతసేపూ సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే ఆయన పరిమితం అవుతున్నారు. వైసీపీ నుంచి విమర్శలొస్తే తిప్పి కొట్టడం చేతకాక… నిస్సహాయ అరుపులు అరుస్తున్నారు. కనీసం తనను ఊపిరైనా తీసుకోనివ్వరా? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలంటేనే ప్రత్యర్థులను శ్వాస తీసుకోకుండా ఇరకాటంలో పెట్టడంగా నాయకులు భావిస్తుంటారు. ఈ క్రీడలో పై చేయి సాధించే వాళ్లనే అధికారం వరిస్తుంది.
కానీ పవన్ మాత్రం ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో విఫలమవుతూ, సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో ప్రయత్న లోపం లేకుండా పవన్ పోరాడుతుంటే… ఎవరైనా అయ్యో పాపం అంటారు. కానీ పవన్ రాజకీయ పంథా అలా వుండడం లేదు. పవన్ రాజకీయం అంతా వీకెండ్స్‌కు పరిమితమైంది.
70 ఏళ్ల పైబడిన వయసులో చంద్రబాబు ఎంతగా జనంలోకి వెళుతున్నారో పవన్ గమనించాలి. కనీసం తనకిష్టమైన నాయకుల నుంచైనా ఆయన స్ఫూర్తి పొందాలి. ప్రజాదరణ పొందేందుకు చంద్రబాబు నానా తిప్పలు పడుతున్నారు. చంద్రబాబో, మరెకరి కష్టార్జితంపై పవన్ అధికారం పొందాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. ట్వీట్లకు పరిమితం కాకుండా, జనంతో మమేకం అయినప్పుడే ఏ రాజకీయ నాయకుడికైనా భవిష్యత్ వుంటుంది. జగన్‌తో ఢీ అంటే ఢీ అని తలపడినప్పుడే తాను రియల్ హీరో అవుతానని పవన్ గుర్తించాలి. ఆ జ్ఞానోదయం అయినప్పుడే పవన్‌కు భవిత వుంటుంది.