జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు కోసం రెండు పార్టీలు గట్టిగానే పట్టుబడుతున్నాయి. ఒకరేమో తమకు మిత్రుడు కాబట్టి మద్దతు మాకే అంటూ క్లెయిం చేసుకుంటూంటే రెండో పార్టీ మాతోనే జనసేన అంటూ చెప్పుకుంటోంది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎన్నిక ఇంకా మూడు నెలల వ్యవధిలో ఉండగానే జనసేన కోసం అటు బీజేపీ ఇటు టీడీపీ పోటాపోటీ పడుతున్నాయి.
గతసారి ఎన్నికల్లో బీజేపీకి టీడీపీకి పొత్తు ఉంది. దాంతో బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సునాయాసంగా గెలిచేశారు. కానీ ఈసారి రాజకీయ సమీకరణలు మొత్తం మారిపోతున్నాయి. బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఆ పార్టీ తరఫున మాధవ్ మరోసారి పోటీకి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నుంచి గతంలో ఎపుడూ అభ్యర్ధిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి పెట్టలేదు.
కానీ ఇపుడు వైసీపీ పోటీ చేస్తూండడంతో టీడీపీ కూడా సై అంటోంది. దీంతో జనసేన మద్దతు ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడలో పవన్ చంద్రబాబు భేటీ జరగకపోతే మద్దతు మాకే అని బీజేపీ గట్టిగా చెప్పుకునేది. ఇప్పటికీ అలాగే చెబుతోంది కానీ పవన్ సపోర్ట్ మాకే ఉంటుంది అని తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది అంటున్నారు.
టీడీపీ తరఫున జీవీఎంసీ కార్పోరేటర్ చిన్నికుమారి పోటీలో ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన అభ్యర్ధిని టికెట్ ఇచ్చామని ఆ పార్టీ చెప్పుకుంటోంది. మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రచారం జోరుగా చేస్తోంది. జనసేన ఓట్లు కూడా తమకు జమ అయితే గెలుపు అవకాశాలు ఉంటాయని టీడీపీ నమ్ముతోంది. దాంతో తమ వెంటే ఆ పార్టీ ఉంటోంది అని అంటోంది.
బీజేపీ అయితే మిత్రపక్షం కాబట్టి జనసేన తమ వైపే అని చెబుతున్నా లోపల ఎక్కడో డౌట్లు ఉన్నాయని అంటున్నారు. జనసైనికులు అయితే ఈ గొడవ ఏదీ లేకుండా ఉండాలంటే తమ పార్టీ తరఫున ఒక అభ్యర్థిని నిలబెట్టేస్తే సరిపోతుందా అని అంటున్నారుట. పవన్ ఎవరికి మద్దతు ఇస్తారో లేక ఎన్నికను పట్టించుకోకుండా వదిలేస్తారో అలా కాకపోతే తమ పార్టీ వారినే బరిలోకి దింపుతారో చూడాలి. ఎవరికి మద్దతు లేదని చెప్పినా ఇబ్బందే కాబట్టి జనసేనకు ఇది ఇరకాటమే అని అంటున్నారు.