పవన్: ఆ ఒక్కరోజే.. ముందూ వెనుకా మూగ నోమే!

ప్రస్తుత సీజన్లో జనసేనాని పవన్ కల్యాణ్ జనసేన పార్టీకోసం కేవలం ఒకే ఒక్క రోజు కాల్షీట్ కేటాయించారు. 14వ తేదీన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తారు. పార్టీ ఆయన సేవలను ఒక్క కాల్షీట్…

ప్రస్తుత సీజన్లో జనసేనాని పవన్ కల్యాణ్ జనసేన పార్టీకోసం కేవలం ఒకే ఒక్క రోజు కాల్షీట్ కేటాయించారు. 14వ తేదీన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తారు. పార్టీ ఆయన సేవలను ఒక్క కాల్షీట్ కు మాత్రమే వాడుకోవాలి. ఎగస్ట్రా కాల్షీట్ పడినా కూడా హీరోగారు ఒప్పుకోరు. ఆ ఒక్కరోజు కావాలిస్తే పార్టీ కోసం ఏ స్థాయివరకైనా చెలరేగిపోతారు. రిహార్సల్స్ గట్రా ఏమైనా అవసరం అని భావిస్తే గనుక.. ఒకటిరెండు రోజులు ముందు అదనంగా కేటాయిస్తారు.అంతే తప్ప.. ఆవిర్భావ ప్రసంగం అయిన తర్వాత.. తుపాకీ గుండుకు దొరకకుండా పారిపోతారు. 

రాష్ట్రాన్ని ఉద్ధరించడమే తన లక్ష్యం, జీవితాశయం అని చెప్పుకునే పవన్ కల్యాణ్, తాను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటినుంచి, చదవడం మానేసినప్పటినుంచి ప్రజల జీవితాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడినని చెప్పుకునే పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎంతో కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సైలెన్స్ పాటిస్తుండడం చాలా చిత్రంగా ఉంది. తాజాగా ఆయన వార్తల్లోకి వస్తున్నప్పటికీ.. ఆవిర్భావ సభ తప్ప మరొక ఊసు లేదు.

రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతోంటే.. పవన్ కల్యాణ్ గళం ఎక్కడా వినిపించడం లేదు. నిజానికి పవన్ కల్యాణ్ మద్దతు పొంది.. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎన్నికల్లో పైచేయి సాధించాలని టీడీపీ తపన పడుతోంది. పవన్ తో మాట్లాడకుండానే.. పవన్ కు తమకు కలిపి ఉమ్మడి అభ్యర్థి మాధవ్ అని బిజెపి చెబుతోంది. బిజెపిని ఈ ఎన్నికల్లోనే సైడ్ లైన్ చేసేసి, తమకు మద్దతు ప్రకటింపజేసుకోవాలని టిడిపి ఆశ. 

ఏదెలా తగలడుతున్నా.. పవన్ పోటీచేయడం లేదు. కనీసం ఎవరికి అనుకూలంగానూ నోరువిప్పే చాన్స్ లేదని తెలుస్తోంది. ఆయన  పరిణామాలను గమనించడంలో బిజీగా ఉన్నారని, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని పార్టీ వారే అంటున్నారు. 

పవన్ కు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఉత్తరాంధ్ర ఎన్నికల విషయంలోనైనా నోరు తెరవాలి కదా అనేది పలువురి సందేహం. విశాఖకు రాజధాని పేరుతో ఉత్తరాంధ్రను మోసం చేస్తున్నారని నమ్ముతున్న పవన్ కల్యాణ్ ఆ విషయాన్ని స్థానిక ప్రజలకు కూడా తెలియజెప్పేలా.. కనీసం పార్టీ రహిత ప్రచారమైనా చేయాలి కదా అనే భావన ప్రజలకు కలుగుతోంది. 

‘విశాఖ రాజధాని’ అనే మాయమాటల విషయంలో ప్రజలను చైతన్యపరచడానికైనా పవన్ ప్రయత్నించాలి కదా అనేది అనేకమంది వాదన. అలాంటి ప్రయత్నమేమీ చేయకుండానే.. ఆయన మీద బురద చల్లేవాళ్లు పెరిగారు. ఆయన కూడా దానికి తగ్గట్టుగా విశాఖ గురించి నోరెత్తకుండా, అసలు సైలెంట్ ఎపిసోడ్ నడిపిస్తున్నారు. గెలవడం సంగతి తర్వాత.. ముందు ఉత్తరాంధ్ర ప్రజల్లో తాను అనుకుంటున్న చైతన్యం తీసుకురావడానికి పవన్ సిద్ధంగానే ఉన్నారా అనేది ప్రశ్న.