జనసేనపై కుల ముద్ర పడిందన్నది వాస్తవం. పవన్‌కల్యాణ్ ఔనన్నా, కాదన్నా ఆ పార్టీకి అంతోఇంతో కుల బలం తప్ప, మరే బలం లేదు. గతంలోలా పవన్ తాను కులాలు, మతాలకు అతీతమని చెప్పడం లేదు. పైగా తాను కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందడానికే ఇష్టపడుతుండడాన్ని గమనించొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జనసేనానిగా కంటే కాపు నాయకుడిగానే పవన్‌కు చెప్పుకో తగిన గౌరవ మర్యాదలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాకపోయి వుంటే, పవన్‌ను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకునే వారు కాదన్నది వాస్తవం. మరోవైపు జనసేనపై కుల ముద్ర పడితే కాపు, బలిజేతరులు ఆదరించరనే భయం జనసేనను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కాపుల సమావేశానికి ముందు బీసీలతో పవన్ భేటీ కానుండడం ఆసక్తికరమే.
ఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన పదో వార్షికోత్సవం జరగనుంది. దీనికి ముందు సన్నాహక సమావేశాలు తలపెట్టడం విశేషం. శనివారం నుంచి పవన్‌కల్యాణ్ దర్శనం ఇవ్వనున్నారన్న మాట. జనానికి, జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆయన కనిపించక చాలా రోజులైంది. ఎట్టకేలకు ఆయన బయటికొస్తున్నారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావాలంటే, ఆ మరుసటి రోజు సమావేశం గురించి తెలుసుకోవాలి. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ భేటీ కానున్నారు. ఇలా చేస్తే పవన్‌ను కాపు నాయకుడిగా కాకుండా, అందరి వాడని ఎలా గుర్తిస్తారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
గత కొంత కాలంగా తమ సామాజిక వర్గానికి చెందిన పవన్‌ను సీఎంగా చూడాలని హరిరామజోగయ్య బహిరంగంగా ఆకాంక్షిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి నాయకుడి నేతృత్వంలో తన సామాజిక వర్గానికి చెందిన వారితో పవన్ భేటీ కావాలని అనుకోవడం ముమ్మాటికీ రాజకీయంగా జనసేనకు నష్టమే. మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుంటున్న చందంగా… ఈ వ్యవహారం వుంది. హరిరామజోగయ్యకు పోయేదేమీ లేదు.
ఆయన వల్ల పవన్‌కు లాభం కంటే, ఇతర సామాజిక వర్గాల్లో వ్యతిరేకత రావడం ఖాయం. ఇలాంటివేవీ ఆలోచించకుండా పవన్ తన కులం వాళ్లతో సమావేశం కావాలని అనుకోవడం ఆయన రాజకీయ అవగాహన రాహిత్యాన్ని, అజ్ఞానాన్ని చూపుతోందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కుల సమావేశాలు ప్రత్యర్థులకు ఆయుధాలు అవుతాయి.