ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ వేశారనే అనుమానంతో సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు కూరిపించారు మాజీ మంత్రి పేర్నినాని. చంద్రబాబు చరిత్ర అంతా అవినీతి, అక్రమాలు, వెన్నుపోట్లేనని.. ఓటుకు కోట్లు కేసులో దొరికి పారిపోయి వచ్చిన చంద్రబాబు… అమ్మడం, కొనడమే తనుకు తెలిసిన రాజకీయం అని.. తీరా అలాంటి వ్యక్తి ఇప్పుడు నంగానాచి కబుర్లు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
ఉండవల్లి శ్రీదేవికి టికెట్ ఇచ్చి గెలిపిస్తే చంద్రబాబుతో కలిసి స్వార్థ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఉండవల్లి శ్రీదేవిని అవమానించారంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని.. ఆమెకు నియోజకవర్గంలో ఆదరణ తగ్గింది. ఆ విషయాన్ని శ్రీదేవికి సీఎం జగన్ నేరుగానే చెప్పారని.. టికెట్ దక్కదనే ఉద్దేశ్యంతోనే ఆమె పార్టీకి నమ్మకద్రోహం చేశారంటూ మండిపడ్డారు.
మనసులో ఏది ఉంటే అది చెప్పడం, చేదు నిజమైన మొహం మీద చెప్పడం, చేసేది చెప్పడం, చేయలేనిది చేయలేను అని చెప్పడం అనేవి జగన్ కు ఉన్న లక్షణాలు అని.. అందుకే ప్రజలకు వైయస్ జగన్ అంటే ఆపార నమ్మకం అని.. చంద్రబాబు లాగా చివరి వరకు మభ్యపెట్టి..నామినేషన్లు అయిపోతున్నప్పుడు మిమ్మల్ని ఆఫీస్ ముందు కూర్చోబెట్టి..ఇంకొకరికి భీఫాం ఇస్తే బాగుంటుందా? అంటూ ప్రశ్నించారు.
వైయస్ జగన్ ఏ ఒక్క కులాన్ని నమ్ముకోలేదని ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నారని.. వెళ్లిపోయిన వారు రకరకాలుగా విమర్శిస్తున్నారని.. వారికి నీతి, నిజాయితీ.. దమ్ము, దైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి స్పీకర్‌కు ఇవ్వవచ్చు కదా? మా అందరి నోళ్లు మూయించవచ్చు కదా? అంటూ సెటైర్ వేశారు.