మాజీ మంత్రి పేర్ని ఏ మాత్రం న్యాయంగా వ్యవహరించడం లేదు. బాపట్ల జిల్లా పర్చూరులో జనసేనాని పవన్‌కల్యాణ్ బహిరంగ ముగిసీ ముగియకనే కౌంటర్ ఇచ్చేందుకు పేర్ని నాని ఆయుధాలు పట్టారు. పవన్‌కల్యాణ్, పేర్ని ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు. పవన్‌కల్యాణ్ మాట్లాడితే చాలు…. నేనున్నా అంటూ పేర్ని అదిరిపోయే పంచ్‌లతో మీడియా ముందుకొస్తుంటారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున పార్టీ తరపున జనసేనాని పవన్‌కల్యాణ్ సాయం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో తాను ద్వేషించే వైసీపీ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ తన మార్క్ విమర్శలు చేశారు. ఆ ఆనందం కాసేపైనా పేర్ని నాని ఉండనివ్వలేదు. “ఏమయ్యా దత్త పుత్రుడా” అంటూ పవన్‌పై పేర్ని నాని చెలరేగిపోయారు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పవన్ చేసిన విమర్శకు దీటుగా పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
పీఎం మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం మీ (ఏపీ ప్రజలు) కోసం మాత్రమే తగాదా పడ్డానని పవన్ అనడంపై పేర్ని రియాక్ట్ అయ్యారు. మరి మోదీతో ఎందుకు కలిశారు? ఎవరికి చెప్పి కలిశారు? ఏ ప్రజల కోసం కలిశారు? ఏం సాధించారు? అంటూ పేర్ని ప్రశ్నల వర్షం కురిపించారు. 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని, మోదీని పాచిపోయిన లడ్డూలని, మోసం చేసిందని, దగా చేసిందని …మీ (పవన్) దృష్టిలో ప్రశ్నించానని, నిలదీశానని చెప్పి, ఇప్పుడు ఏ ఉద్దేశంతో కలిశారని పేర్ని అడిగారు.
బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా సాధించారా? వైజాగ్ స్టీల్ పరిశ్రమను ప్రైవేట్‌పరం కాకుండా నిలబెట్టారా? మోదీ, అమిత్‌షాలతో ఏం మాట్లాడి వచ్చారు? వైజాగ్‌లో మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? ఎవర్ని దగా చేస్తారు? తనను మాటలతో వైసీపీ నేతలు హింసిస్తున్నారని, చంద్రబాబు దత్తపుత్రుడని అంటున్నారని పవన్ వాపోతున్నారని పవన్ చెప్పుకొచ్చారు. అలాగే జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని పవన్ అంటున్నారన్నారు. మీరు చంద్రబాబునాయుడి దత్తపుత్రుడు ఔనో, కాదో మాట్లాడుకుందామన్నారు.
ఈ ఏడాది మార్చిలో జనసేన ఆవిర్భావ సభలో ఏం మాట్లాడవని పేర్ని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఓటమే లక్ష్యం, ఆయన వ్యతిరేక పార్టీలన్నీ కలవాలని, చంద్రబాబుతో కలిసి పని చేయాలని బీజేపీకి కూడా తాను చెబుతున్నట్టు పవన్ అన్నారని గుర్తు చేశారు. 2012లో తాను పార్టీ పెడితే జగన్ గెలుస్తాడని చంద్రబాబు హెచ్చరించారని, అందువల్ల 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు చెప్పలేదా? అని పవన్‌ను పేర్ని నిలదీశారు. 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీలిపోవాలి కాబట్టే విడిగా పోటీ చేశారని చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు, మనమంతా చంద్రబాబు వెనకాల వెళ్లాలని చెబుతున్నాడని పవన్‌పై విమర్శలు గుప్పించారు.
మిమ్మల్ని చంద్రబాబు దత్తపుత్రుడని అనకూడదంటే, 2024లో నిజాయతీగా మీరు ఎలా పోటీ చేస్తారో చూద్దామన్నారు. గుంటూరు జిల్లాలో జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడినట్టు కాకుండా, తాజాగా పర్చూరు సభలో మాట్లాడినట్టు పవన్‌కల్యాణ్ సొంతంగా పోటీ చేస్తే, తాము కూడా చంద్రబాబు దత్తపుత్రుడు కాదని ఒప్పుకుంటామని పేర్ని నాని చెప్పడం విశేషం. మీరేం చేస్తారో వేచి చూద్దామన్నారు. రోజుకో మాట, పూటకో మాట అని పవన్‌పై సెటైర్స్ విసిరారు.