వైసీపీ నాయకుడు, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్‌రెడ్డి తనను రక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వేడుకుంటూ ఆర్తనాధాలు చేశారు. అయితే ఆయనది అరణ్య రోదనైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసుల దెబ్బలకు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అధికార పార్టీలో వుంటూ, పోలీసులతో బండ బూతులు తిట్టించుకోవడంతో పాటు గొడ్డును బాదినట్టు బాదడం సూళ్లూరుపేట వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సునీల్‌రెడ్డిని ఎస్ఐ రవిబాబు, సిబ్బంది కలిసి మూకుమ్మడి దాడి చేశారు. దెబ్బల్ని తట్టుకోలేక సునీల్‌రెడ్డి అరిచిన అరుపులు మార్మోగాయి. కానీ ఆయన్ను కాపాడే దిక్కులేకుండా పోయింది. స్వయంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డైరెక్షన్లోనే సునీల్‌పై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్‌రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాయి. దీంతో పోలీసులు కరుణించి సునీల్‌రెడ్డిని విడిచిపెట్టారు. కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో తమకు సరైన గౌరవమే దక్కిందని వైసీపీ నేతలు వాపోతున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సొంత పార్టీలోనే వ్యతిరేకత తయారైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్‌రెడ్డి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంలో వుంటున్నారు. ఇటీవల ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు. తనకు అవమానం జరిగిందని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవిబాబు తనకు ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడని మీడియా సమక్షంలో వినిపించారు.
ఇదే ఎస్ఐ రవిబాబు ఆగ్రహానికి కారణమైంది. గతంలో టీడీపీ హయాంలో సునీల్‌రెడ్డిపై నమోదైన రౌడీషీట్‌ను సాకుగా తీసుకుని, ఆదివారం ఆయన్ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకున్నాడు. వైసీపీ నేతలు అందిస్తున్న మేరకు స్టేషన్లో ఏం జరిగిందంటే…
” ఏరా నా కొడకా ఏంది నీ కథ” అని సునీల్‌రెడ్డిని ఎస్ఐ తిట్టాడు. “అలా తిట్టొద్దు సార్, మర్యాదగా మాట్లాడండి” అని సునీల్ కోరారు. “నువ్వేం చేస్తావురా నా కొడకా” అని ఎస్ఐ గదమాయించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోఆప్షన్ మెంబర్‌పై ఎస్ఐ చేయి చేసుకున్నాడు. దీంతో ఎస్ఐ కాలర్‌ను సునీల్‌రెడ్డి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్లో పోలీసులంతా కలిసి అతన్ని చితక్కొట్టారు.
ఈ విషయం తెలిసి మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్రెడ్డితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలంతా పోలీస్‌స్టేషన్ దగ్గరికి భారీగా చేరుకున్నారు. ఎస్ఐ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ నాయకుడిపై దాడి చేసిన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే సునీల్‌రెడ్డిని విడుదల చేయాలని కోరారు. వైసీపీ నిరసనకు దిగొచ్చిన పోలీసులు వెంటనే సునీల్‌రెడ్డిని విడిచిపెట్టారు. అతన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన గొంతుకు బెల్ట్ బిగించి చంపేందుకు ఎస్ఐ ప్రయత్నించాడని సునీల్‌రెడ్డి ఆవేదనతో చెప్పుకొచ్చారు.