అమలాపురంలో విధ్వంసానికి పాల్పడిన వారిపై కాకుండా, అమాయకులపై కేసులు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇవాళ మాత్రం మంత్రి విశ్వరూప్ అనుచరులపై కూడా కేసు పెట్టినట్టు వార్తలు రావడం గమనార్హం. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ గత నెల 24న పెద్ద ఎత్తున అమలాపురంలో విధ్వంసానికి తెగబడ్డారు.
ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ నివాసం ఉంటున్న ఇంటిని, అలాగే ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ బాబు నివాసాన్ని తగలబెట్టారు. అదృష్టవశాత్తు మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు వారి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విధ్వంసానికి పాల్పడిన వారిలో తన వాళ్లున్నా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలనే అప్పుడే మంత్రి విశ్వరూప్ పోలీసులను కోరారు.
ఈ నేపథ్యంలో విధ్వంస కేసులో అరెస్ట్ అయి ఎ-222గా ఉన్న చీకట్ల వీరవెంకట సత్యప్రసాద్ వాంగ్మూలం మేరకు వైసీపీ నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులైన సత్యరుషి, వాసంశెట్టి సుభాష్, మట్టపర్తి మురళీకృష్ణ, మట్టపర్తి రఘులపై కేసు నమోదైంది. వీరంతా పరారీలో ఉన్నారు.
అమలాపురం ఘటనలో మొత్తం 258 మందిని నిందితులుగా గుర్తించి కేసులు నమోదు చేశారు. వీరిలో 142 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారంతా పరారీలో ఉన్నారని, పట్టుకునేందుకు ఏడు బృందాలను నియమించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. ఇదిలా వుండగా అమలాపురం విధ్వంసానికి సంబంధించి అమాయకులపై కేసులు నమోదు చేసి హింసిస్తున్నారని కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఘటనతో ఏ మాత్రం సంబంధం లేని వారిని ఎలా ఇరికిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. చివరికి అధికార పార్టీకి చెందిన నలుగురిపై కేసు నమోదు చేయడాన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా చూస్తాయో.
అమలాపురం విధ్వంసం రాజకీయ మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రభుత్వమే చేయించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆరోపణలను పాలక పక్షం దీటుగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు డీజీపీ వెల్లడించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల స్వార్థ రాజకీయాలను పసిగట్టక పోవడంతో అమాయకుల జీవితాలు నాశనమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.