జనసేనలో టికెట్ల లొల్లి ఓ రేంజ్లో వుంది. 30 నుంచి 40 అసెంబ్లీ టికెట్లు దక్కుతాయని జనసేన నాయకులు ఆశించారు. అయితే మొదట 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు జనసేనకు కేటాయించినట్టు చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు ఎఫెక్ట్ జనసేనపై తీవ్రంగా పడింది. మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాన్ని జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. అసలే ముష్టి పడేసినట్టు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారనే ఆవేదనలో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు…సీట్లు మరిన్ని తగ్గడంతో రగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో విజయవాడ వెస్ట్ టికెట్ ఇస్తానని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్‌కు జనసేనాని గతంలో మాట ఇచ్చారు. బీజేపీతో పొత్తు వల్ల పోతిన సీటును బీజేపే ఎగేసుకెళ్లింది. దీంతో విజయవాడ వెస్ట్‌లో రచ్చ మొదలైంది. పవన్‌కు ఎంతో నమ్మకస్తుడిగా, నీడలా వుండే పోతిన మహేశ్ సీటుకు ఎసరు పెట్టడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పోతినకు సీటు ఇవ్వాల్సిందే అంటూ జనసేన శ్రేణులు ఆందోళనకు దిగాయి.
సీటు కోసం జనసేన శ్రేణులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వస్తుందని ఏనాడూ అనుకోలేదని పోతిన వాపోయారు. ఇటీవల హైదరాబాద్‌లో పవన్‌ను కలిసినప్పుడు కూడా విజయవాడ వెస్ట్ సీటు తనకే అని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీకి కేటాయించినట్టు తన పార్టీ వర్గాలు చెప్పాయని ఆయన అంటున్నారు. 2019లో పవన్‌కల్యాణ్ ఓడితే, ఆయన్ను అందరూ విడిచి వెళ్లారన్నారు.
అలాంటి కష్ట కాలంలో పవన్‌కు తాను అండగా వున్నానని ఆయన గుర్తు చేశారు. అలాంటి తనకు టికెట్ ఇవ్వకపోతే , పవన్ ఫొటోతో ఎన్నికల బరిలో వుంటానని ఆయన తేల్చి చెప్పారు. పవన్‌కు నీడలా వెన్నంటి వుండే పోతిన మహేశ్‌కు సీటు ఇవ్వకపోతే, ఇక పవన్‌కల్యాణ్ ఎందుకని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే తాము పవన్‌కు అండగా నిలిచేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.