ఏపీ బీజేపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైఖరిపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకుంది. దివంగత వంగవీటి మోహన్‌రంగా పేరు కేంద్రంగా జీవీఎల్ సొంత ఎజెండాతో ముందుకెళుతున్నారనే ఆగ్రహం పార్టీ నాయకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లను జిల్లాలకు, అలాగే సంక్షేమ పథకాలకు పెట్టడాన్ని ఆయన ఇటీవల కాలంలో తరచూ తప్పు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో దివంగత ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి సోషల్ మీడియా వేదికగా జీవీఎల్‌కు పరోక్షంగా చీవాట్లు పెట్టారు. అన్నీ ఇద్దరి పేర్లేనా అని శీర్షిక పెట్టి, మరీ జీవీఎల్‌కు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా జీవీఎల్ దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్‌ల పేర్లపై అభ్యంతరం చెబుతూ మాట్లాడిన వీడియోని ట్విటర్‌లో షేర్ చేస్తూ, పురందేశ్వరి ఆ ఇద్దరు నాయకుల గొప్పతనాన్ని రాత మూలకంగా చెప్పడం విశేషం.
పురందేశ్వరి షేర్ చేసిన వీడియోలో జీవీఎల్ ఏమన్నారంటే…”ఈ రాష్ట్రంలో రాజకీయాలు కేవలం రెండు పార్టీలు, రెండు కుటుంబాలకు పరిమితమైన అంశం కాదు. ఏది చూసినా ఆ కుటుంబం లేదా ఈ కుటుంబం. ఆ పార్టీ, ఈ పార్టీ. అన్నీ వాళ్లద్దరి పేర్లేనా (ఎన్టీఆర్, వైఎస్సార్). సామాజిక న్యాయం అనేది అందరికీ వుండాలా? లేదా? వంగవీటి మోహన్‌రంగా కేవలం ఒక్క కాపుల కోసం పని చేయలేదు. బడుగు, బలహీన వర్గాలందరి కోసం పని చేసిన వ్యక్తి. ఇతర నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టినప్పుడు, మోహన్‌రంగా పేరు పెట్టాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలా?”
ఈ వ్యాఖ్యలపై పురందేశ్వరి సమాధానం ఏంటో తెలుసుకుందాం. ఈ సందర్భంగా ఆమె రెండు ట్వీట్లు చేశారు. “ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు” అని పురందేశ్వరి చెంప ఛెళ్లుమనేలా ఒక ట్వీట్‌లో జవాబిచ్చారు. అలాగే మరో ట్వీట్‌లో ఏముందంటే…
“అన్నీ ఇద్దరి పేర్లేనా” ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం– 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు” వాళ్లిద్దరూ వ్యక్తులు కాదని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజలకు ఎన్టీఆర్, వైఎస్సార్ ఏం చేశారో పురందేశ్వరి చెప్పడం ద్వారా… జీవీఎల్ నోరు మూయించేందుకు యత్నించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.