ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విరుచుకుపడ్డారు. పరోక్షంగా తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని పురందేశ్వరి విమర్శించడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ముందుగా పురందేశ్వరి విమర్శల గురించి తెలుసుకుందాం.
భస్మాసురుడు తన తలపై చేయి పెట్టుకున్నట్లు 2019లో సీఎంగా జగన్‌ను రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై రూ.12 లక్షల కోట్లు అప్పు భారం మోపారని ఆమె ఆగ్రహించారు. రాష్ట్రంలో తాకట్టుకు ఏదీ అనర్హం కాదన్న పరిస్థితి ఉందని విమర్శించారు. రాష్ట్రంలో గనులను ఏడు వేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. అలాగే పవిత్రమైన సచివాలయాన్ని బ్యాంకుకు తనఖా పెట్టిన ఘనత వైసీపీది అని ఆమె విమర్శించారు. తనఖా పెట్టడం తప్పు కాదని వైసీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆమె విరుచుకుపడ్డారు.
సచివాలయం తాకట్టు వార్తలపై కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొడాలిని దృష్టిలో పెట్టుకునే ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో పురందేశ్వరి కామెంట్స్‌పై కొడాలి తనదైన రీతిలో చురకలు అంటించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనల ప్రకారం అప్పు చేస్తున్నామన్నారు.
కేంద్రంలో బీజేపీకి అధికారం వుందని, పురందేశ్వరి వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చని కొడాలి సూచించారు. ఒకవేళ పరిమితికి మించి అప్పు చేస్తున్నట్టైతే అడ్డుకోవచ్చన్నారు. తాము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం కాదని, పురందేశ్వరి ఎంపీ కావడం కోసం టీడీపీకి బీజేపీని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఘాటు విమర్శ చేశారు. పురందేశ్వరి తాకట్టు చర్యల్ని బీజేపీ కార్యకర్తలు, పెద్దలు కనిపెట్టారన్నారు. రాబోయే రోజుల్లో పురందేశ్వరి పదవి ఊడగొడతారని ఆయన హెచ్చరించారు.