రాఘవులు మూడు అంటే నారాయణ రెండు

ఏపీలో బీజేపీకి ఏ పార్టీ శత్రువు అంటే చాలా ఈజీ క్వశ్చన్ అని అంతా అంటారు. రాజకీయాల మీద ఆ మాత్రం అవగాహన ఉన్న వారు అంతా ఏపీలో బీజేపీకి ప్రధాన పార్టీలలో శత్రువులు…

ఏపీలో బీజేపీకి ఏ పార్టీ శత్రువు అంటే చాలా ఈజీ క్వశ్చన్ అని అంతా అంటారు. రాజకీయాల మీద ఆ మాత్రం అవగాహన ఉన్న వారు అంతా ఏపీలో బీజేపీకి ప్రధాన పార్టీలలో శత్రువులు ఎవరూ లేరు అని నిర్ధారిస్తారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం బీజేపీ కోసం తపిస్తున్నాయని, జనసేన మిత్రుడిగా ఏనాడో మారిపోయిందని చెబుతారు.

అందరికీ అర్ధమయ్యే ఈ చిన్న విషయం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు తెలియదా అంటే ఆయనకు కూడా తెలుసు అనే వారే ఉంటారు. కానీ విశాఖ ఉక్కు పోరాటం కోసం జరిగిన సభలో మాట్లాడుతూ నారాయణ వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ రావడమే విశేషం.

ఏపీలో వైసీపీ కేంద్రంలో బీజేపీ దోస్తీ చేస్తూ ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టేసిందని నారాయణ విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలను దూరం పెట్టాలని ఆయన కోరుతున్నారు. ఇదే సభలో ప్రసంగించిన సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు అయితే నిర్మొహమాటంగా ఏపీలో మూడు పార్టీలూ బీజేపీతో అంటకాగుతున్నాయని ఘాటైన విమర్శ చేశారు.

బీజేపీకి దాని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని పార్టీలు ముందుకు వస్తూంటే ఏపీలో మాత్రం వైసీపీ, టీడీపీ, జనసేన అంటకాగుతున్నాయని ఆరోపించారు. ఈ పార్టీలు ఇప్పటికైనా తమ వైఖరి మర్చుకోకపోతే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతాయని ఆయన హెచ్చరించారు.

బీవీ రాఘవులు అంత నిక్కచ్చిగా ఆ మూడు పార్టీలు అంటే నారాయణ మాత్రం బీజేపీ వైసీపీలనే టార్గెట్ చేయడం విడ్డూరమైన రాజకీయంగానే చూస్తున్నారు. 

రేపటి ఎన్నికల్లో టీడీపీ జనసేనలతో పొత్తులకు సీపీఐ చూస్తోందని ప్రచారంలో ఉన్న మాట. అందుకే చంద్రబాబు అంత బాహాటంగా మోడీని ప్రశంసిస్తున్నా నాలుగేళ్ళుగా చంద్రబాబు కేంద్రం మీద పల్లెత్తు మాట అనకపోయినా సీపీఐ నాయకులు మాత్రం గొంతెత్తి పసుపు పార్టీని విమర్శించలేకపోతున్నారు అని అంటున్నారు. పైగా వైసీపీని గద్దె దించేందుకు ఏపీలో అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు ఇస్తున్నాయని అంటున్నారు.