ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయడమే ఆలస్యం… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2019లో వైసీపీ తరపున నరసాపురం నుంచి రఘురామ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ఎందుకనో ఆయనకు వైఎస్ జగన్‌తో పొసగలేదు. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, రఘురామ కుదురుగా ఉండలేకపోయారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా సీఎంను కూడా దూషిస్తున్నారని రఘురామపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం పెంచుకున్నాయి. చివరికి ఆయనపై సీఐడీ కేసు నమోదైంది. హైదరాబాద్ నుంచి ఆయన్ను గుంటూరుకు తీసుకెళ్లారు. ఆ రాత్రి గడిస్తే చాలు అనే భయాందోళనతో గడిపినట్టు రఘురామ అనేక సార్లు చెప్పారు. తనను చితక్కొట్టారని, లైవ్‌లో జగన్‌కు చూపించారని కూడా ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం మారింది. రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు. దీంతో తనకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిన నాటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుతో పాటు నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదు చేయడమే ఆలస్యం, వెంటనే వారిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో జగన్ ఏ3 కావడం గమనార్హం. ఇంకా ఏ4గా విజయ్‌పాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతి పేరును పోలీసులు చేర్చారు.
తనపై కేసు నమోదు చేయడంపై ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ స్పందించారు. సుప్రీం కోర్టులో మూడేళ్ళు నడిచి.. సాక్ష్యాత్తూ సుప్రీమ్ కోర్ట్ తిరస్కరించిన కేసులో కొత్తగా FIR వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని సునీల్‌కుమార్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేసు ఎలా నడుస్తుందో చూడాలి.