ధర్మరాజు పాఠాన్ని చదువుకోలేదా ధర్మానా?

ఆయన మాటలు నష్టం చేయడం మాత్రం గ్యారంటీ! అయితే ఏ రేంజిలో నష్టం చేస్తాయనేది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఆయన నియోజకవర్గంలో ప్రజల వద్ద సాధించుకున్న నమ్మకాన్ని నీరు గారుస్తాయా? ఆ…

ఆయన మాటలు నష్టం చేయడం మాత్రం గ్యారంటీ! అయితే ఏ రేంజిలో నష్టం చేస్తాయనేది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఆయన నియోజకవర్గంలో ప్రజల వద్ద సాధించుకున్న నమ్మకాన్ని నీరు గారుస్తాయా? ఆ ప్రాంతం మొత్తంలో దెబ్బకొడతాయా? లేదా రాష్ట్రవ్యాప్తంగా పతనాన్ని నిర్దేశిస్తాయా? అని వైసీపీ కార్యకర్తలే అంచనాలు వేస్తున్నారు. 

ఆయనేమీ రాష్ట్రం మొత్తాన్నీ ప్రభావితం చేసేంత సీనియారిటీ గానీ, సేవా తత్పరత గానీ, నాయకత్వ లక్షణాలు గానీ ఉన్న గొప్ప వ్యక్తి కాదు. కాబట్టి పార్టీకి చేటులేదు. పైగా ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎజెండా ఎత్తుకుని ఇతర ప్రాంతాల ప్రజలను తనే దూరం చేసుకున్నారు. అలాంటి నేత మాటలు ఎంత చేటు, ఎంత మేలు అనే తర్జన భర్జన పార్టీలో జరుగుతోంది. ఆయన మరెవ్వరో కాదు.. మంత్రి ధర్మాన ప్రసాద రావు.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అనేక కార్యక్రమాల మీద ఈ వ్యతిరేకత కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజలు సంస్కరణల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సంస్కరణల్న ఆమోదించేదాకా ఈ వ్యతిరేకత ఉంటుంది’’ అంటున్నారు. ప్రజల్లో అనుమానాలు పెంచుతున్నారు. దానితో పాటు.. మూడు రాజధానులంటే అచ్చంగా మూడు ఉంటాయని కాదు. విశాఖ మాత్రమే రాజధాని! హైకోర్టుతో పనులుండే వాళ్లే కర్నూలు వెళ్తారు. ఏడాదికి మూడుసార్లు శాసనసభ కోసం మేం అమరావతికి వెళ్తాం’’ అంటూ.. వికేంద్రీకరణ వ్యతిరేకించే వారికి కొత్త భయాలు పుట్టిస్తున్నారు. 

అయితే ఇలాంటి మాటల వల్ల.. స్థానికంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీ పట్ల నమ్మకం, క్రేజ్ పెంచుతానని ఆయన భ్రమపడుతున్నారేమో గానీ.. మేలు కంటె చేటే ఎక్కువ జరుగుతుంది. సరిగ్గా ఇక్కడే ధర్మరాజు పాఠాన్ని ధర్మాన ప్రసాదరావు చదువుకోలేదా అని అనుమానం కలుగుతుంది. 

కురుక్షేత్రంలో ధర్మరాజు.. ద్రోణాచార్యుడిని మట్టుపెట్టడం కోసం ‘‘అశ్వత్థామ హతః కుంజరః’’ అన్నాడు. నిజమే చెప్పాడు.. కానీ మాయ చేయడానికి చెప్పాడు. ఆ మాట ధర్మరాజు నోటినుంచి వచ్చింది గనుక.. ద్రోణుడు నమ్మి హతమయ్యాడు. ఆయనకు ‘‘అశ్వత్థామ హతః’’ వరకే వినిపించింది. ‘‘కుంజరః’’ అనేది బుర్రలోకి వెళ్లలేదు. ఈ పాఠం ధర్మాన తెలుసుకోవాలి.

‘‘ప్రభుత్వం వ్యతిరేకత ఉంది.. ఇంకా కొంతకాలం ఉంటుంది’’ అనే నెగటివ్ మాటలు మాత్రమే ప్రజలకు ఎక్కువ రీచ్ అవుతాయి. ‘‘ప్రభుత్వం సంస్కరణలు చేస్తోంది. అవంతా పూర్తయ్యాక అందరి జీవితాలు గొప్పగా ఉంటాయి’’ లాంటి మాటలు మరుగున పడతాయి. స్వయంగా జగన్ కేబినెట్ లోని మంత్రి.. ‘ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఒప్పుకుంటున్నారు’ అనే ప్రచారం విస్తృతంగా సాగి పార్టీకి చేటుచేస్తుంది. ఈ సత్యం ధర్మాన గుర్తించాలి.