గెలిచిన వాళ్లను తమ పార్టీలో కలిపేసుకోవడం మాత్రమేకాదు. గెలిచే అవకాశం ఉన్న వాళ్లను కూడా ముందుగానే గుర్తించి.. తమ పార్టీలో చేర్చుకుని టికెట్ కేటాయించేయడం, తద్వారా తమ పార్టీ గెలుపుల బలాన్ని పెంచుకోవడం అనేది కూడా రాజనీతే! ఈ రాజనీతినే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పాటిస్తున్నారు.
రాజధాని హైదరాబాదు నగర పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరగబోతున్న ఉప ఎన్నికలో ఆయన భాజపా ప్రకటించిన అభ్యర్థిని కాంగ్రెసులో చేర్చేసుకున్నారు. ఇది తెలంగాణలో బాగా విస్తరించాలని చూస్తున్న కమలదళానికి మాస్టర్ స్ట్రోక్ గా పలువురు భావిస్తున్నారు.
ఎందుకంటే, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారాస తరఫున పోటీచేసిన లాస్యనందిత (సాయన్న కుమార్తె) విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ గద్దర్ కూతురు వెన్నెల మూడోస్థానంలో మాత్రమే నిలిచారు. అయితే భాజపా తరఫున పోటీచేసిన శ్రీగణేశ్ నారాయణన్ రెండోస్థానంలో నిలిచారు. ఆయన లాస్యనందితో చేతిలో 17వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తమాషా ఏంటంటే.. అదివరకటి ఎన్నికతో పోలిస్తే లాస్యనందిత ఓటు శాతం పది శాతం వరకు తగ్గగా, శ్రీగణేశ్ ఓటు శాతం 20 శాతం వరకు పెరిగింది.
ఇప్పుడు లాస్యనందిత ఇటీవలి యాక్సిడెంట్ లో మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. భారతీయ జనతా పార్టీ- తమ అభ్యర్థిగా శ్రీగణేశ్ నారాయణన్ నే తిరిగి మోహరించింది. ఆయన చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు కూడా. అలాగే కాంగ్రెస్ కూడా గద్దర్ కూతురు వెన్నెలనే మళ్లీ పోటీ చేయిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ చాణక్యం పనిచేసింది. శ్రీగణేశ్ కు గెలుపు అవకాశాలు ఉన్నాయని అర్థం కాగానే.. ఆయనకు గేలం వేయించారు.
మంగళవారం మధ్యాహ్నం వరకు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీగణేశ్, అదేరోజు రాత్రి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఆయన చేరిక వెనుక మైనంపల్లి హనుమంతరావు, మహేందర్ రెడ్డి తదితరులు చక్రంతిప్పారు.
ఈ నియోజకవర్గంలో ఎవరిని పోటీకి దింపాలో భారాస ఇంకా నిర్ణయించుకోలేదు. చనిపోయిన లాస్య నిందిత సోదరి నివేదిత తనకు టికెట్ కావాలని అడుగుతున్నారు గానీ.. పార్టీ తేల్చలేదు.
ఒకవైపు రేవంత్ సర్కారు త్వరలోనే కూలిపోతుందని భాజపా, భారాసలు అదేపనిగా ఊదరగొడుతున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి గేట్లు తెరిచేసి భారాస ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలుపుకోవడం ప్రారంభించారు. ఈ తాజా చర్యతో భాజపా గెలుపు గుర్రాలను కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమైన సంకేతం ఇచ్చారు.