ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని పరిస్థితి. ఏపీ రాజకీయాలను పార్టీల అధినేతలు, వాటి నాయకులు కాకుండా వ్యూహకర్తలు శాసిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం రాబిన్‌శర్మ, ప్రశాంత్ కిషోర్ (పీకే) టీం మధ్య ఎత్తుగడల ఫైట్ నడుస్తోంది. గతంలో జగన్‌ను పీకే గట్టెక్కించారని చంద్రబాబు అండ్ టీం బలంగా నమ్ముతోంది. తమపై తీవ్ర వ్యతిరేకతను సృష్టించడంలో పీకే టీం సక్సెస్ అయ్యిందని టీడీపీ ఆరోపణ.
ఈ నేపథ్యంలో జగన్‌పై వ్యతిరేకత సృష్టించేందుకు టీడీపీ కూడా అదే పంథాను అనుసరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రాబిన్‌శర్మను తమ ఎన్నికల వ్యూహకర్తగా టీడీపీ నియమించుకుంది. రాబిన్‌శర్మ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో టీంలు ఇప్పుడిప్పుడే దిగుతున్నాయి. అయితే జగన్ కోసం మరోసారి పీకే టీంలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేస్తున్నాయి.
అధికార పార్టీ బలాలు, బలహీనతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రజాభిప్రాయాల్ని సమగ్రంగా తెలుసుకునే పనిలో పీకే టీం నిమగ్నమైంది. అసలే జగన్ సర్వే నివేదికల ఆధారంగా టికెట్లు ఇస్తుండడంతో, వైసీపీ నేతల్లో గుబులు పుట్టింది. ఇదిలా వుండగా జగన్ ప్రభుత్వంపై అతిపెద్ద వ్యతిరేక కార్యక్రమంగా ఇదేం ఖర్మ గురించి టీడీపీ విస్తృత ప్రచారం చేపట్టింది. డిసెంబర్ ఒకటి నుంచి జనంలోకి వెళ్లేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇది రాబిన్‌శర్మ సృష్టించిందే.
ఇదేం ఖర్మ కార్యక్రమంపై రాబిన్ టీం పర్యవేక్షిస్తుంది. నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాబిన్ టీం సభ్యులుంటారు. వీరంతా పార్లమెంట్ పరిధిలోని కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షిస్తారు. నియోజకవర్గాల క్లస్టర్ సమావేశాల్లో పాల్గొంటూ ఇదేం ఖర్మ అమలుపై సూచనలు ఇస్తున్నారు. అయితే ఇదేం ఖర్మ కార్యక్రమం పేరే బెడిసి కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ, చంద్రబాబుపై జగన్ తీవ్రస్థాయిలో ఎదురు దాడికి దిగారు.
ఇదేం ఖర్మరా బాబూ అనే ఊత పదం ఉండడంతో, చంద్రన్నకు నెగెటివ్ అయ్యిందన్న అభిప్రాయం టీడీపీలో వుంది. అయితే ఇప్పటికే ప్రకటించిన కార్యక్రమం కావడంతో ఇక వెనక్కి తగ్గకూడదనే మొండి పట్టుదలతో టీడీపీ ముందుకెళుతోంది. జగన్ తరపున పీకే టీం, టీడీపీకి రాబిన్‌శర్మ…ఎవరి వ్యూహాలు అధికారానికి చేరువ చేస్తాయో కాలం జవాబు చెప్పాల్సి వుంది. మొత్తానికి తెర ముందు కనిపించేది ఒకరైతే, తెర వెనుక ఆడించే వ్యూహకర్తలు వేరే.