చంద్రబాబు, నారా లోకేశ్‌పై మంత్రి ఆర్కే రోజా అన్‌స్టాపబుల్ సెటైర్స్ వేస్తున్నారు. చిన్న అవకాశం దొరికినా చంద్రబాబు, ఆయన కన్న కొడుకు, దత్త పుత్రుడిపై రోజా తన మార్క్ వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా టీచర్స్ డేని పురస్కరించుకుని చంద్రబాబుపై రోజా అదిరిపోయే పంచ్ విసిరారు.
తిరుపతిలో ఓ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగలు, డెకాయిట్స్లకు గురువు చంద్రబాబునాయుడు అని సెటైర్ విసిరారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో నేర్పించడంలో చంద్రబాబు దిట్ట అని రోజా విమర్శించారు. సినిమాల్లో కలెక్షన్ కింగ్‌గా మోహన్‌బాబుకు పేరుందని, కానీ దోచుకోవడంలో కలెక్షన్ కింగ్ చంద్రబాబునాయుడని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో వేల కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయని ఆమె అన్నారు.
చంద్రబాబు, లోకేశ్ అక్రమాస్తులపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయాలని రోజా డిమాండ్ చేశారు. త్వరలో చంద్రబాబును తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ తరిమేస్తారని రోజా సంచలన కామెంట్ చేశారు. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో సీటు కోసం డిమాండ్ ఉండేదన్నారు. ఇప్పుడా పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. భగవంతుడితో సమానంగా మనం పూజించేది గురువును మాత్రమే అని రోజా అన్నారు.
ప్రత్యర్థులపై రోజా పంచ్ డైలాగ్‌లతో ఆకట్టుకుంటున్నారు. ఇదే సందర్భంలో ప్రత్యర్థులకు ఆమె టార్గెట్ అవుతున్నారు. అయినప్పటికీ ఆమె బెదరలేదు. ప్రభుత్వం నుంచి ఆమెకు తగిన ప్రోత్సాహం కరువైంది. అయినప్పటికీ తనకు మంత్రి పదవి ఇచ్చారనే కృతజ్ఞతతో రోజా చెలరేగిపోతున్నారు.