ఆర్కే రోజా… రాజకీయ నేతగా కంటే టాలీవుడ్ హీరోయిన్‌గా సుపరిచితురాలు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాస్త నోరున్న మహిళ కావడంతో ఏ పార్టీలో ఉన్నా ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె నగరి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండో దఫా ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా…రెండో విడత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్నారు.
వైసీపీలో పదవి ఉన్నా, లేకపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరపున గట్టిగా మాట్లాడే నాయకుల్లో రోజా మొదటి వరుసలో వుంటారు. మీడియా ముందుకొచ్చి ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. వైసీపీలో రోజా పవర్ ఫుల్ అని అందరూ అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. నగరి నియోజకవర్గంలో రోజాకు పొగ పెట్టారు. నగరి నియోజకవర్గంలో రోజా కంటే, వైసీపీలోని ఆమె వ్యతిరేకుల మాటే చెల్లుబాటు అవుతుంది. వాళ్ల పనులే బాగా అవుతాయి.
తాజాగా నగరి మండలంలో రోజాకు బద్ధ వ్యతిరేకి అయిన వైసీపీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్‌కు మైనింగ్ ఇచ్చారు. నగరి మండలంలోని కీలపట్టులో కేజే కుమార్‌కు 17 హెక్టార్లలో మైనింగ్‌కు అనుమతులు దక్కాయి. ఈ విషయం తెలిసి రోజా షాక్‌కు గురైంది. అసలే రోజా, కేజే కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. వైసీపీలోనే వుంటూ తనకు వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న కేజే కుమార్‌కు భారీ ఆర్థిక లబ్ధి కలిగించడంపై రోజా ఆగ్రహంగా ఉన్నారు.
అయితే రోజాకు అధికారుల నుంచి కూడా పూర్తిగా సహాయ నిరాకరణే. దీంతో రోజాకు దిక్కుతోచని పరిస్థితి. ఈ విషయమై అమీతుమీ తేల్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు వెళ్లాలని రోజా నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరోవైపు రోజాకు వ్యతిరేకంగా నగరి నియోజకవర్గం నుంచి భారీగా సీఎంకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధమైంది.
ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వ డొల్లతనం బయట పడుతోంది. ఒకరి నియోజకవర్గంలో మరొకరి జోక్యాన్ని మొదట్లోనే జగన్ అరికట్టి వుంటే… నేడు ఈ దుస్థితి తలెత్తేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీకి ఒక పద్ధతి, పాడు లేదని ఆ పార్టీ నాయకుల అభిప్రాయం.
ఇదే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గానికి వెళితే, మంత్రి జోగి రమేశ్ జోక్యాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సహించలేదు. మంత్రి తన నియోజకవర్గంలో చొరబడడంపై వసంత కృష్ణప్రసాద్ బహిరంగంగానే నిలదీశారు. వ్యవహారం సీఎం వద్దకెళ్లింది. ఆయన సర్దుబాటు చేసి పంపాను. ప్రస్తుతానికి మైలవరం వైసీపీలో నివురుగప్పిన నిప్పులా వుంది.
ఇలా ప్రతి నియోజకవర్గంలో జగన్ నాయకత్వం అసమ్మతిని ప్రోత్సహించేలా వుంటే ఎలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. తన కోసం గట్టిగా వాదించే రోజానే కాపాడుకోలేకపోతే, ఇక ఎవరైనా జగన్‌ను ఎలా నమ్ముతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉదాసీనత, లెక్కలేనితనం వల్ల నగరిలో రోజా పరిస్థితి దయనీయంగా మారింది.
ఒక్క మాటలో చెప్పాలంటే నగరిలో రోజా గెలిస్తే రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్టే. ఆ పరిస్థితి ఉందో లేదో ఒకసారి తన సర్వే సంస్థల ద్వారా జగన్ నివేదికలు తెప్పించుకుని పరిశీలించాలి. వైసీపీ పతనానికి ప్రతిపక్షాలు కారణం కానేకాదు. ఆ పార్టీపై జగన్ సమన్వయం కొరవడడం, అసమ్మతులను పట్టించుకోకపోవడమే అనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు నిలువెత్తు ఉదాహరణగా నగరి నియోజకవర్గం నిలుస్తోంది.