జనసేన శ్రేణులు మంత్రి ఆర్కే రోజాను టార్గెట్ చేశాయి. ఎందుకంటే, జనసేనాని పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేందుకు రోజా మొదటి వరుసలో నిలబడి ఉంటారు. రోజా కూడా పవన్‌లాగే చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో, సహజంగానే ఆమె విమర్శలు వైరల్ అవుతున్నాయి. పంచ్ డైలాగ్‌లతో పవన్‌పై విమర్శలు చేస్తూ సీఎం జగన్ మన్ననలను రోజా పొందుతున్నారు.
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రోజా కనిపించగానే జనసేన శ్రేణులు రెచ్చిపోయాయి. రోజా లక్ష్యంగా పవన్ అభిమానులు ఆమె కారుతో పాటు, అంగరక్షకులపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా రోజా వ్యక్తిగత సహాయకుడు గాయపడిన సంగతి తెలిసిందే. రోజాతో ఉన్న ఇతర మంత్రులు, అధికార పార్టీ నేతలపై ఈ స్థాయిలో జనసైనికులు దాడికి పాల్పడకపోవడం గమనార్హం. విశాఖ గర్జన సభలో కూడా రోజా ప్రసంగిస్తూ… పవన్‌పై ఓ రేంజ్లో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
పెళ్లి చేసుకోడానికి, నటన నేర్చుకోడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్‌కల్యాణ్‌కు విశాఖ అవసరమైందని, కానీ రాజధాని మాత్రం వద్దని ఆయన అంటున్నారని రోజా ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్, ఉత్త పుత్రుడు లోకేశ్ అని ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో రోజా విమర్శలపై కాకమీదున్న జనసైనికులకు, ఎయిర్‌పోర్ట్‌లో ఆమె కనిపించగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడికి పాల్పడ్డారు.
విశాఖ ఘటన అనంతరం రాజకీయంగా ఆమెను లక్ష్యంగా చేసుకుని జనసేన నేతలు విమర్శలు గుప్పించడం గమనార్హం. పవన్ కల్యాణ్ ప్యాకేజి తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, మరి క్రూజ్ శంకుస్థాపన జరిగిన నాలుగు రోజుల తర్వాత మంత్రి రోజాకు బెంజ్ కారు ఎలా వచ్చిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రశ్నించారు. 100 శాతం బెంజి కారు మంత్రికి గిఫ్టేనని ఆయన విమర్శ చేశారు.
జనసేన కార్యకర్తలు ఎవరిపైనా దాడి చేయలేదని, మంత్రి రోజా రెచ్చగొడుతూ ప్రవర్తించారని ఆయన ఆరోపించడం గమనార్హం. రానున్న రోజుల్లో రోజాపై ఇలాంటి దాడులు మరిన్ని జరగొచ్చు.