జనసేనాని పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడంలో మంత్రి ఆర్కే రోజా ముందు వరుసలో వుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా పవన్‌ను రాజకీయంగా చీల్చి చెండాడేందుకు రోజా ఉత్సాహం చూపుతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పవన్ అంటే గిట్టదు కాబట్టి. ఇవాళ మరోసారి పవన్‌పై రోజా విరుచుకుపడ్డారు. రాజకీయంగా ఆయన్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో రోజా మీడియాతో మాట్లాడుతూ పవన్ ప్రచార వాహనం వారాహి కాదు… అది నారాహి అని సెటైర్ విసిరారు. కత్తులతో ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పవన్‌కల్యాణ్ వున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలని అనుకుంటున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేయాలని అనుకుంటున్నట్టు పరోక్షంగా రోజా విమర్శలు చేశారు.
175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలేని దుస్థితిలో జనసేన వుందని ఆయన దుయ్యబట్టారు. పవన్ వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. పవన్‌కు మీడియా అనవసర ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించడం గమనార్హం. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి పవన్, చంద్రబాబులను హైదరాబాద్‌కు జగన్ పంపడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. పవన్ దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అని రోజా విమర్శించడం గమనార్హం.
తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడ్తానని పవన్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మంత్రులు , వైసీపీ నేతలు అదే విమర్శను మరింత బలంగా చేయడాన్ని గమనించొచ్చు. మరీ ముఖ్యంగా పవన్ ప్రచార రథం వారాహిపై వైసీపీ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తోంది. నారాహి అనే పేరు పెట్టి పవన్‌ను అధికార పార్టీ ఇరిటేట్ చేస్తోంది. 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ మరోసారి రోజా సవాల్ విసిరారు.
చివరికి వైసీపీ పోరు పడలేక… పవన్ 175 స్థానాల్లో పోటీ చేయడమా లేక రాజకీయాల నుంచి విరమించుకోవడమా? ఏదో ఒకటి జరిగి తీరుతుందేమో!