విశాఖ అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు. అద్భుతాలకు విశాఖ గమ్యస్థానం. అందాలకు కేరాఫ్ అడ్రస్. పర్యాటకానికి విశాఖ అసలైన చిరునామా. అటువంటి విశాఖకు వైసీపీ ఏమి చేసింది జగన్ ఏమి అభివృద్ధి చేశారు అని తరచూ విపక్షాల నుంచి ప్రశ్నలు వస్తూ ఉంటాయి.
దానికి జవాబు అన్నట్లుగా విశాఖ రుషికొండ మీద దాదాపుగా అయిదు వందల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టూరిజం భవనాలు ఇపుడు అత్యంత ఆకర్షణీయంగా మారాయి. సామాజిక మాధ్యమాలలో వీటిని చూస్తున్న నెటిజన్లు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
మొత్తం ఏడు భవనాలు నిర్మాణం జరుపుకున్నాయి. వీటిని రాత్రి వేళ సర్వాంగసుందరంగా విద్యుద్దీపాలతో అలంకరించిన తరువాత చూడాలంటే రెండు కళ్ళూ సరిపోవు. టూరిజం విభాగం వీటిని డ్రోన్ కెమెరాల సాయంతో చిత్రీకరించి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలలో పంచుకుంది.
దాంతో రుషికొండ కట్టడాలకు అపూర్వమైన స్పందన లభిస్తొంది. రాజమహల్ ని మించిన తీరులో ఈ భవనాలు ఉన్నాయని అంతా అంటున్నారు. రుషికొండ బోడి గుండు అయిందని అక్కడ ఏవేవో నిర్మిస్తున్నారు అంటూ విపక్షాలు గత నాలుగేళ్ళుగా నోరు పారేసుకున్న నేపధ్యం ఉంది.
అయితే ఈ వీడియోలో చూస్తే ఇంత అందమైన భవనాలు విశాఖ కీర్తి కిరీటంలో చేరి మరింతగా వెలిగిపోతున్నాయని అంటున్నారు. విశాఖకు వచ్చే ఇంటర్నేషనల్ టూరిస్టులను ఈ భవనాలు విశేషంగా ఆకట్టుకుంటాయని దాని వల్ల టూరిజం విభాగానికి పెద్ద ఎత్తున ఆర్ధిక వనరులు సమకూరుతాయని అంటున్నారు.
గతంలో రుషికొండ మీద అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ టూరిజం భవనాలను నిర్మించారు. ఆనాడు ఈ కొండలను తవ్వింది టీడీపీ ప్రభుత్వమే. అలా హరిత రిసార్ట్స్ పేరు మీద భవనాలను కట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక నాలుగు దశాబ్దాల నాటి పాత భవనాల స్థానంలో ఆధునీకరించాలని భావించారు. వాటి స్థానంలో కొత్త భవనాలను పునర్నిర్మించాలని కూడా నిర్ణయించారు. దాంతో అన్ని రకల అనుమతులు తీసుకుని ఈ కట్టడాలని సకాలంలో నిర్మించారని పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆకాశం నుంచి రాత్రి వేళ చూస్తే విశాఖలో రుషికొండ భవనాలు అద్భుతంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.