ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు సంపద సృష్టిపై నిత్యం నీతిసూక్తులు చెప్పేవారు. జగన్ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకే భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతోందని, దీనివల్ల రాష్ట్రం దివాళా తీస్తోందని చెప్పడానికి రకరకాల దేశాలను తెరపైకి టీడీపీ, దాని అనుకూల మీడియా తెరపైకి తెచ్చేవి. జగన్ వైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారనే భయంతో తమకు అధికారం ఇస్తే వైసీపీ సర్కార్ కంటే రెండింతల సంక్షేమ లబ్ధి చేకూరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం ఆర్థికంగా ఏమై పోవాలని ప్రశ్నించేవారికి చంద్రబాబు తన మార్క్ సమాధానం ఇచ్చారు. తాను సంపద సృష్టిస్తానని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ వచ్చారు. చెప్పింది చంద్రబాబు కాబట్టి, దాన్ని నమ్మించే బాధ్యతను ఆయన అనుకూల మీడియా నెత్తికెత్తుకుంది. మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది.
బాబు ఇచ్చిన హామీల అమలు డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా సంపద సృష్టిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఢిల్లీలో కీలక కామెంట్స్ చేశారు.
సంపద సృష్టించడానికి తమ వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఆయన ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంపద సృష్టి అనేది దీర్ఘకాలిక ప్రణాళికగా ఆయన చెప్పుకొచ్చారు, సంపద సృష్టించాలంటే కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.
జీతభత్యాల కోసం అప్పులు తప్పడం లేదని మంత్రి అన్నారు. మంత్రి కామెంట్స్ విన్న తర్వాత సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకోవాలా? లేదా? అనేది ప్రజల ఇష్టం. అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో హామీల్ని చంద్రబాబు ఇచ్చారు. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు.