నారా లోకేశ్ హీరోగా తెరకెక్కిన యువగళం అనే సినిమా అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు అభిమానులు, టీడీపీ శ్రేణుల ఉత్సాహంతో సందడి కనిపించింది. రెండో రోజు వచ్చే సరికి తుస్సుమనిపించింది. రెండోరోజు పాదయాత్ర కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమైంది. అయితే లోకేశ్ పాదయాత్రకు ఆశించిన స్థాయిలో ఇమేజ్ రాలేదు. మరీ ముఖ్యంగా యువగళం అని పేరులో తప్ప, యువకుడిలో కనబడాల్సిన ఉత్సాహం లోకేశ్‌లో కనిపించడం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి.
పాదయాత్రలో భాగంగా లోకేశ్ చేయెత్తి పిడికిలి బిగించడం మొదలుకుని, జనానికి చేరువయ్యే తీరు అంతా కృత్రిమంగా ఉందన్న భావన విస్తృతంగా ప్రచారం అవుతోంది. మరీ ముఖ్యంగా గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్రతో లోకేశ్ నడకను పోల్చుకుంటున్నారు. లోకేశ్ కంటే వయసులో ఎంతో పెద్దవాడైన రాహుల్‌గాంధీ ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇదే లోకేశ్ విషయానికి వస్తే… రెండోరోజుకే నీరసించినట్టుగా కనిపిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది.
మరోవైపు జనం కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో కనిపించలేదు. దీంతో లోకేశ్ పాదయాత్రను టీడీపీ సోషల్ మీడియాలో ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. రికార్డ్ చేసిన వీడియో పుటేజీని సోషల్ మీడియాలో ఇస్తూ… లోకేశ్ పాదయాత్రకు జనం వెల్లువెత్తుతున్నారనే కలరింగ్ ఇచ్చేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారు.
లోకేశ్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు టీడీపీ సోషల్ మీడియాకు తల ప్రాణం తోకకు వస్తున్నట్టు అందులోని కొందరు సిబ్బంది చెబుతున్నారు. ఇదే రీతిలో లోకేశ్ పాదయాత్ర కొనసాగితే మాత్రం… టీడీపీకి లాభం సంగతి పక్కన పెడితే భారీ నష్టం తప్పదనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీని నుంచి టీడీపీ ఎలా బయటపడుతుందో చూడాలి.