ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొన్ని రోజులు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనుల్లో ఆమె నిమగ్నం కానున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఇటీవల తనపై రోజా చేసిన విమర్శలకు షర్మిల గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో రోజా జబర్దస్త్‌గా దోపిడీకి పాల్పడుతున్నారని పంచ్ విసిరారు.
రోజా జబర్దస్త్ అనే కార్యక్రమానికి హోస్ట్‌గా పని చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని షర్మిల దెప్పి పొడిచారు. నగరిలో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం ఆమె రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఈ నెల 18న షర్మిల తనయుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియా వివాహం రాజస్థాన్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. గత నెల 17న హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు వెళ్లి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రాజస్థాన్‌లో వివాహ వేడుక తలపెట్టడం, వాటి ఏర్పాట్లు చూసుకోవాల్సి వుండడంతో కొన్ని రోజుల పాటు ఆ పనుల్లో షర్మిల బిజీ కానున్నారు. వివాహం అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాతే రాజకీయ కార్యకలాపాల్లో షర్మిల పాల్గొనున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
తన కుటుంబంలో జరిగే శుభ కార్యానికి సంబంధించి అన్నీ ముగించుకుని బహుశా ఈ నెల 25వ తేదీ తర్వాతే షర్మిల పొలిటికల్ షెడ్యూల్ మొదలయ్యే అవకాశం వుంది.